బొద్దుగా ఉండడం తప్పు కాదు. కానీ అలా ఉండడం వల్ల ఆమె పదిహేనేండ్ల పాటు హేళనలు భరించాల్సి వచ్చింది. అదంతా ఒకప్పటి విషయం. ఇప్పుడు స్లిమ్‌గా మారింది. యాక్టర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంటోంది. ‘‘ఫ్యామిలీలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు ఎందరున్నా.. నటన రాకపోతే నటులు కాలేరు. నటించాలనే ఆసక్తి ఉంటే సరిపోదు. దానికోసం కష్టపడాలి. నిరంతర సాధన చేస్తేనే అవకాశాలు వస్తాయి’’ అంటోంది షర్మిన్ సెహగల్. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు ఈ షర్మిన్. అసలు ఈమె కెరీర్ ఎలా మొదలైంది? ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? వంటి ఇంట్రెస్టింగ్ సంగతులు ఆమె మాటల్లోనే...
సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా కెరీర్ మొదలైంది. 2013లో ‘గోలియోంకి... రామ్–లీల’తో మొదటి అడుగు పడింది. తర్వాత ‘మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ, గంగుబాయి కతియావాడి’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నా. ఆ టైంలో నేర్చుకున్న విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భాష గురించి. నాకు ముంబయి హిందీ అలవాటు. కానీ ‘బాజీరావు మస్తానీ’ షూటింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ ప్రాంప్టింగ్ ఇచ్చేదాన్ని.
ఒకసారి రణ్వీర్ డైలాగ్ ప్రాక్టీస్ చేయడం కోసం స్క్రిప్ట్ పేపర్ తీసుకురమ్మన్నాడు. నేను డైలాగ్స్ అందిస్తుంటే ఆయన వాటిని తిరిగి నాకు చెప్తున్నాడు. కాసేపయ్యాక ఆయన నా చేతిలో నుంచి పేపర్ లాక్కుని ‘అచ్చమైన హిందీ భాష ఎలా ఉంటుందో’ తెలుసుకో అన్నాడు. అప్పుడు నేను ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నా. అప్పటి నుంచి హిందీనే కాదు.. ఇతర భాషలు మాట్లాడేటప్పుడు, ఇంగ్లిష్ వేరే భాషలో మిక్స్ చేసినా మాట్లాడటం నేర్చుకున్నా. ఎంత ఎఫర్ట్ పెడితే అంత బాగా సినిమా వస్తుందని తెలుసుకున్నా. అలాగే యాక్టర్‌గా చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లా చేయకూడదు అని కూడా అర్ధమైంది.
ధైర్యం సరిపోలేదు
‘మేరీకోమ్’ (2014) సినిమా చేసేటప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నా. కానీ యాక్టింగ్ చేయడానికి మాత్రం ధైర్యం చాల్లేదు. నా గురించి తెలిసిన కొందరిలో రణ్వీర్ సింగ్ ఒకడు. తనకు నేనేంటో తెలుసు. భన్సాలీకి కూడా తెలుసు. కానీ, నేనెప్పుడూ యాక్టర్ కావాలనుకుంటున్నట్టు ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆ విషయంలో నాకే కచ్చితమైన అభిప్రాయం లేనప్పుడు బయటకు చెప్పడం కష్టం కదా. ‘మేరీకోమ్’ మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే టైంలో ఉండాల్సిన దానికంటే 40 కేజీల బరువు ఎక్కువ ఉన్నా. అందుకే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఐదారేండ్లు కష్టపడి బరువు తగ్గా.. ఆ తర్వాత యాక్టింగ్‌లోకి అడుగుపెట్టా.
యాక్టింగ్ కోర్సు తీసుకున్నా
మాది మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీనే. మా అమ్మ బేలా సెహగల్ మూవీ ఎడిటర్. నాన్న దీపక్ సెహగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ వెంచర్లో కంటెంట్ హెడ్. మా అమ్మ వాళ్ల అన్నయ్య అంటే నా మేనమామ మూవీ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్ సంజయ్ లీలా భన్సాలీ. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ మోహన్ సెహగల్‌కి మనవరాలిని. మా అమ్మమ్మ తాతయ్యలు నవీన్ భన్సాలీ, లీల ఫిల్మ్ ప్రొడ్యూసర్లు. మా ఫ్యామిలీలో అందరికీ మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కానీ నటనలో ఎవరికీ ప్రవేశం లేదు. నాకేమో నటించడం అంటే ఇష్టం. మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, నటన మీద ఇష్టం ఉంటే సరిపోదు. నటన అంత ఈజీ కాదు. అందుకే యాక్టింగ్ నేర్చుకునేందుకు న్యూయార్క్‌లోని ‘లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’లో యాక్టింగ్ కోర్సు చేశా.
అలా అడుగుపెట్టా..
సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘మలాల్’ అనే సినిమాతో 2019లో యాక్టింగ్ డెబ్యూ చేశా. అందులో నా పాత్ర పేరు ఆస్తా త్రిపాఠి. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ సినిమాలోని నా పాత్ర ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫీమెల్ డెబ్యూగా నామినేట్ అయ్యింది. రెండేళ్ల తర్వాత 2022లో ‘అతిథి భూతో భవ’ అనే సినిమాలో ఎయిర్ హోస్టెస్ ‘నేత్ర బెనర్జీ’ పాత్రలో నటించా. ఆ సినిమాకి క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. మరో రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో నటించా. అది రీసెంట్గా రిలీజ్ అయింది. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలు ఈ మూడే. మిగతావన్నీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినవే.
ఆఫర్లు రాలేదు
‘మలాల్’ గురించి చెప్పాలంటే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ చేయలేదు. నటీనటుల మధ్య మాత్రమే కాదు. ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీ ఉంటుంది. ‘మలాల్’ సినిమాతో నాకు ప్రశంసలు అయితే దక్కాయి. కానీ, ఆ తర్వాత నాకు ఎటువంటి అవకాశాలు రాలేదు. యాక్టర్ తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అవకాశాలను వెతుక్కోవాలి. లైఫ్ ఎలాంటి అవకాశం ఇచ్చినా దాన్ని పట్టుకునేందుకు రెడీగా ఉండాలి. ఆ అవకాశం రావాలంటే కష్టపడి పనిచేయాలి. నాకు వచ్చిన అలాంటి అవకాశమే ‘మలాల్’.
ఆ తర్వాత నేను చేసిన సినిమా ‘అతిథి భూతో భవ’. అది 25 రోజుల్లో షూటింగ్ చేసేశాం. ఈ సినిమా డైరెక్టర్, మిగతా వాళ్లు నా సామర్ధ్యం మీద నమ్మకం పెట్టడం భయంగా అనిపించింది. అది నాకు రెండో సినిమా అయినప్పటికీ ఒక దశలో నన్ను నేను నమ్మలేకపోయా. అప్పుడు డైరెక్టర్ హార్దిక్ నాకు ధైర్యమిచ్చి, మోటివేట్ చేసేవాళ్లు. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నా. కంటెంట్ సెలక్ట్ చేసుకునేటప్పుడు క్యారెక్టర్ ఏంటి? అదెలా ఎండ్ అవుతుంది? అనేది చూస్తా. ఒకవేళ స్క్రిప్ట్ సరిగా అర్థం చేసుకోలేకపోయినా... నా క్యారెక్టర్ గ్రాఫ్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటా.
సంజయ్ ది గ్రేట్
నాకు నాలుగేండ్లు ఉన్నప్పుడు మామయ్య (సంజయ్) సెట్‌కి వెళ్లేదాన్ని. నేను ఆయనకు అసిస్టెంట్‌గా మారాక ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అర్థం అయింది. హిందీ సినిమాకి ఆయన కంట్రిబ్యూషన్ చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా టీమ్ వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆయన్ని నేను ‘సంజయ్ సర్’ అనే పిలుస్తా. ఆయన తీసిన ‘దేవ్‌దాస్’ సినిమాను నా పదిహేడేండ్ల వయసులో చూశా. అప్పటి నుంచి ఆయన మీద గౌరవం ఇంకా పెరిగింది. నా సామర్థ్యాలను బయట ప్రపంచానికి చూపించడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడాయన.
లావు వల్లే అనుకున్నా...
స్కూల్లో లావు ఉన్నా అని నన్ను చాలా ఏడిపించేవాళ్లు. నా మీద పేపర్లు విసిరేవాళ్లు. నేను ఏడ్చేదాన్ని. ఇంటర్మీడియెట్‌కి వచ్చాక థియేటర్ క్లాస్‌లకు వెళ్లేవరకు డాక్టర్ అవ్వాలనేది నా గోల్. అయితే థియేటర్‌కి వెళ్లడం మొదలుపెట్టాక అక్కడ కూడా నా లావుని చూసి నాకు ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఇచ్చి నటించమనేవాళ్లు. నేను చాలా ఈజీగా చేసేదాన్ని. అక్కడ ముగ్గురు అబ్బాయిలు నన్ను ర్యాగింగ్ చేసేవాళ్లు. స్టేజీ మీద పర్ఫార్మ్ చేసేటప్పుడు నేను ఆడియెన్స్ వైపు చూస్తుంటే ఆ ముగ్గురు అబ్బాయిలు నవ్వేవాళ్లు. లావుగా ఉన్న నన్ను చూసి నవ్వుతున్నారు అనుకున్నా. కానీ, ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. వాళ్లు నేను చేసే క్యారెక్టర్ చూసి నవ్వుతున్నారని!
పదిహేనేండ్లు ఎదుర్కొన్నా
మాది పబ్లిక్‌కి తెలిసిన ఫ్యామిలీ కావడం వల్ల నా లావు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు అంటే పదిహేనేండ్లు లావు కారణంగా వేధింపులు ఎదుర్కొన్నా. నటి కావాలంటే స్లిమ్‌గా ఉండాలి అనే నమ్మకాన్ని పక్కన పెట్టా. తన శరీరాకృతిని చూసి కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్లిమ్‌గా ఉండాలా? బొద్దుగా ఉండాలా? అనేది వ్యక్తిగతమైన విషయం.
హీరామండీ కోసం..
ఈ సినిమాకి నా గొంతు, కళ్లు బాగా వాడమని చెప్పారు సంజయ్. షూటింగ్ టైంలో నా కళ్లు వెయిట్ లాస్ అయ్యాయి! ఎందుకంటే నేను ఐ–జిమ్ రోజుకి 15 గంటలు చేసేదాన్ని. కళ్లతో ఎక్స్ప్రెషన్స్పలికించడానికి, టైమింగ్‌ని బట్టి ఎమోషన్స్ కళ్లలో చూపించేందుకు ట్రై చేశా. అంతేకాకుండా ‘పాకీజా’, ‘ఉమ్రావ్ జాన్’, ‘మొఘల్ – ఎ ఆజమ్’ వంటి పీరియాడిక్ సినిమాలు చూశా. ఈ సినిమా షూటింగ్లో షాహీ మహల్‌కి రెండు వైపులా ఉండే ఒక సీన్ కోసం 48 టేకులు తీసుకున్నా.
- ప్రజ్ఞ