సంక్రాంతిలోపు ఫీజు బకాయిలు చెల్లించాలి : బండి సంజయ్

  • తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే: బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: సంక్రాంతి పండుగలోపు ఫీజు రీయంబర్స్‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలు పూర్తిగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ఉద్యమాలు చేసైనా రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని హెచ్చరించారు. ‘దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్’ పేరిట బండి సంజయ్‌‌‌‌ నిర్వహించిన కోచింగ్ సెంటర్ లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని క్యాంపు ఆఫీసులో ఆదివారం సన్మానించారు.

అనంతరం సంజయ్​ మాట్లాడుతూ.. హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంవల్లే ఈ రోజు ఉద్యోగాలు సాధించారన్నారు. ‘రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ప్రకటించి 4 ఏండ్లైనా.. వాటిని భర్తీ చేయలే. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది. 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి.. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్తున్నది’ అని అన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారని, కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా సూపర్ పవర్‌‌‌‌‌‌‌‌గా సోనియాగాంధీ కొనసాగుతూ రబ్బర్ స్టాంప్ గా మార్చారని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత ఆ పార్టీకి లేదని మండిపడ్డారు.