గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందే : బండి సంజయ్

  • జీవో నంబర్ 29ని రద్దు చేయాలి
  • నిరుద్యోగుల ఉసురు తగిలే కేసీఆర్  ఫాంహౌస్​లో పన్నాడు
  • కాంగ్రెస్  ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని హెచ్చరిక 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్  చేయాల్సిందేనని, రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 29ని రద్దు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్  చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, మూసీ పునరుజ్జీవనంతో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. కాంగ్రెస్  పార్టీలోనే కొందరు నేతలు, మంత్రులు సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. 

కరీంనగర్ లోని ఎంపీ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా నేతలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళన పూర్తిగా న్యాయమైనదేనని, వారికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. న్యాయం చేయాలని కోరిన నిరుద్యోగులపై లాఠీచార్జ్  చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ నిరుద్యోగుల వద్దకు సామాన్య కార్యకర్తగా వెళ్లి అండగా ఉంటానని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29ని   ఉపసంహరించుకుని, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్  చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్కార్ కు, కాంగ్రెస్  పాలనకు తేడా లేదని, మోసాలు చేయడంలో రెండు పార్టీలు నంబర్  వన్  అని విమర్శించారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లయినా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగుల బ్రాండ్ అంబాసిడర్ లా బీఆర్ఎస్  నేత కేటీఆర్  పోజు కొట్టడం సిగ్గుచేటని, దొంగ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల ఉసురు పోసుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని మండిపడ్డారు. 

నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలే కేసీఆర్  ఫామ్ హౌస్ లో పన్నాడని, రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుపైనా సంజయ్  విమర్శలు చేశారు. మూసీ పునరుజ్జీవనంతో అక్కడి ప్రజల జీవనమే పోతుందని ఆరోపించారు. మూసీ పేరుతో 11 వేల ఇండ్లను కూల్చడానికి తాము వ్యతిరేకమన్నారు.