లెటర్​ టు ఎడిటర్.. గ్రేటర్ డ్రైనేజీ వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపాలి

ఆధునిక సమాజంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతతో కూడిన  యంత్రాలను వినియోగిస్తున్నారు.  ఈ వ్యవస్థ చక్కగా ఉంటేనే ప్రజలు అత్యంత ఆరోగ్యంగా జీవించటానికి వీలుపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ  నిర్మాణం నిర్వహణ లోపాలు దారుణంగా ఉన్నాయి. నగరంలో అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన ప్రదేశాలు మినహాయించి ఇతర ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉంది.   అంతేకాక నెలల తరబడి డ్రైనేజీ  చాంబర్లను  శుభ్రం చేయడం లేదు. 

 ఫిర్యాదు చేసినప్పుడు అవసరమైన చోట మాత్రమే లైనును శుభ్రం చేస్తుంటారు.   రాకపోకలకు అంతరాయం ఏర్పడి  ప్రమాదాలకు కూడా  దారి తీస్తుంటుంది. మరొక విషయం మురుగు నీరు పారుదలలో అంతరాయం ఏర్పడినప్పుడు చాంబర్ల వద్ద తడిమట్టి తీసి పక్కకు వేస్తుంటారు మట్టిని ఎండిన తర్వాత  ట్రక్కులలో తీసుకొని పోవలసి ఉంటుంది. కానీ, ఆచరణలో ఈ పని  చేయడం లేదు. ఫలితంగా ఈ తడిమట్టి రోడ్డులపై విస్తరించి ‌అనారోగ్య కారకంగా మారుటకు అవకాశం ఉంటున్నది.  ఈ తడి మట్టిని సంబంధించిన శాఖ వారు ఎత్తివేసినట్టు నమోదు చేసుకుంటారా తెలియదు. 

 డ్రైనేజీ వ్యవస్థను నిరంతరంగా శుభ్రం చేయుటకు మానవ వనరులకు బదులుగా ఆధునిక యంత్రాలను వినియోగించాలి. ఒక కాల నిర్ణయం పట్టిక ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి ఫిర్యాదులు రాకముందే తగు మరమ్మతులు  నిర్వహణ కాలానుగుణంగా చేపట్టాలి. హైదరాబాద్ మహా నగరాన్ని అందంగా శుభ్రంగా ఉంచుటకు ప్రజలందరూ సహకరించాలి.  

ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, అధికారులు తమ కర్తవ్యాన్ని అంకిత భావంతో  నిర్వహించినప్పుడే సాధ్యం అవుతుంది. తెలంగాణ రాజధానిని దేశంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా తీర్చిదిద్దాలి.నగరంలో  డ్రైనేజీ సమస్యనే అతి పెద్ద సమస్య. 

దండంరాజు రాంచందర్ రావు 
పాత బోయినపల్లి