పెరగనున్న ‘యాసంగి’ విస్తీర్ణం

  • జిల్లాలో ఈసారి సాగునీటి కళకళ
  •  వరి, వేరు శనగ  పంటలపై రైతుల మొగ్గు..  

నాగర్ కర్నూల్​.వెలుగు :  జిల్లాలో యాసంగి   సాగులో  ఈసారి   విస్తీర్ణం పెరగనుంది. కిందటిసారి కాల్వల ద్వారా పంటలకు సాగునీరివ్వలేమని ప్రభుత్వం ముందుగానే చెప్పడంతో రైతులు బోర్లతో  పంటలు సాగుచేశారు.  కానీ ఈ ఏడాది  వానాకాలంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. చెరువులు  నిండిపోయాయి. కేఎల్​ఐ ద్వారా నీరివ్వడానికి ఎటువంటి ఇబ్బందులు  లేవు. దీంతో రైతులు ఈ యాసంగిపై దృష్టి పెట్టారు. యాసంగిలో సాగు  సగటు విస్తీర్ణం 2,48,791 ఎకరాలు కాగా ఈ యాసంగిలో దాదాపు 70 వేల ఎకరాల్లో అదనంగా పంటలు సాగవుతాయని అంచనావసేతున్నారు. ఈ సీజన్​లో జిల్లాలో    3.10లక్షల ఎకరాలలో సాగు జరిగే  అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు  చెప్తున్నారు.  కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ కాల్వల కింద సుమారు 2.50లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా. 

చెరువులు, బోర్ల ద్వారా మరో 60 వేల ఎకరాలు సాగు కానుంది. వరి సాధారణ విస్తీర్ఱం 98వేల ఎకరాలు కాగా గత ఏడాది 1.14లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి 1.46లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.  వరి తర్వాత అధికంగా పండించే వేరు శనగ  సాధారణ విస్తీర్ణం 1.27లక్షల ఎకరాలు అయితే పోయినసారి ఏదీ కలిసి రాలేదు. దీంతో 90వేల ఎకరాలు మాత్రమే సాగు చేశారు. ఈసారి 1.25లక్షల ఎకరాల్లో వేరు శనగ  పంట సాగయ్యే అవకాశాలున్నాయి.

  గత యాసంగిలో సాగు చేసిన పంటలకు చివరి తడుల కోసం బీఆర్​ఎస్ సర్కార్​లోని మంత్రులు,ఎమ్మెల్యేల చుట్టూ రైతులు తిరిగినా  శ్రీశైలం డెడ్​స్టోరేజీకి  చేరడంతో  సాగు నీరివ్వలేదు.  అక్టోబర్​ నెలలోనే కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటి పంపింగ్​ను బంద్ పెట్టిన గత ప్రభుత్వంలోని అధికారులు కాల్వల రిపేర్ల అంశాన్నీ ముందుకు తెచ్చి నీరివ్వక పోగా కాల్వలను బాగు చేయలేదు. దీంతో మొక్కజొన్న, కందులు, జొన్నలు ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. అంచనా కంటే సగం విస్తీర్ణం తగ్గింది.  ఈయాసంగిలో జొన్నలు 3వేల ఎకరాలు, మొక్కజొన్న 20వేల ఎకరాలు,కందులు 16వేల ఎకరాలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నట్లు అంచనా వేశారు.

విత్తనాల కొరత లేకపోతే...

జిల్లాలోని భూములు వరి, వేరు శనగ, పత్తి, మొక్కజొన్న ఇతర ఆరుతడి పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. కెఎల్​ఐ ప్రాజెక్టు ద్వారా సాగు నీరందడంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 2.50వేల ఎకరాలకు వరకు సాగుకు ఢోకా ఉండదు.నోటిఫైడ్​ చెరువులు, బోర్ల కింద సాగు అవుతుంది. 1.46లక్షల  ఎకరాల్లో సాగు చేసే వరి పంటకు  విత్తనాల కొరత 
ఉండదు.  

వేరు శనగ విత్తనాలకు డిమాండ్​... 

రెండు రోజులు   వానలు పడితే చాలు వేరుశనగ విత్తనాల కోసం  మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు.  ప్రభుత్వం వేరు సెనగ విత్తనాలను సప్లై చేసే పరిస్థితి లేదు.  దీంతో కొందరు వ్యాపారులు రాయలసీమ, గుజరాత్​ నుంచి విత్తనాలు తెప్పిస్తున్నారు. వాటిని స్థానిక రైతులకు అధిక ధరలకు అంటగడుతున్నారు.  చేసేదేమీ లేక రైతులు వ్యాపారులు చెప్పిన ధరలు చెల్లించక తప్పడం లేదు.  15 రోజుల కింద క్వింటాల్​ వేరుశనగ విత్తనాలు రూ.12.500 వరకు ఉండగా చూస్తుండగానే రూ.13.800 నుంచి రూ.14.300 వరకు పెరిగింది.    కొందరు వ్యాపారులు విత్తనాల కంపెనీల పేర్లు, కొత్త లేబుళ్లు మార్చుస్తూ.. అనుమతులు లేకుండానే విత్తనాలను అమ్మతున్నారు. అధికారులు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.