నిమిషం లేటైనా నో ఎంట్రీ ఇయ్యాల, రేపు గ్రూప్-3 ఎగ్జామ్స్

  • ఉమ్మడి జిల్లాలో 37,913 మంది అభ్యర్థులు, 119 సెంటర్లు
  • గంటన్నర ముందే చేరుకోవాలి.. అరగంట ముందు గేట్లు క్లోజ్​ 
  • జువెలరీ, షూస్​ధరించొద్దు.. ఎలక్ట్రానిక్స్​కు అనుమతి లేదు 
  • పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం

మంచిర్యాల, వెలుగు: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో జరుగనున్న గ్రూపు–3 ఎగ్జామ్స్​ కోసం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమిషం నిబంధనను స్ట్రిక్ట్​గా అమలు చేస్తూ.. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని ప్రకటించారు. 

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్​-2, 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్​-3 పరీక్షలు జరుగతాయి. అభ్యర్థులను గంట ముందుగానే సెంటర్​లోకి అనుమతిస్తారు. అరగంట ముందే గేట్లు క్లోజ్​ చేస్తారు.హాల్​లోకి వెళ్లడానికి ముందు హాల్​ టికెట్, ఐటెంటిటీ వెరిఫికేషన్​తో పాటు బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి ఎగ్జామ్ టైమ్​ కంటే కనీసం గంటన్నర ముందుగా సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

37,913 మంది అభ్యర్థులు, 119 సెంటర్లు..

గ్రూప్​3 ఎగ్జామ్స్​కు ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లాలో 37,913 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం 119 సెంటర్లను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 15,063 మందికి 48 సెంటర్లు, ఆదిలాబాద్ లో 10,255 మంది అభ్యర్థులకు 29 సెంటర్లు, నిర్మల్​లో 8,124 మందికి 24 సెంటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 4,471 మందికి గానూ18 సెంటర్లను ఏర్పాటు చేశారు. 

ఐదారు సెంటర్లను ఒక రూట్​గా​ విభజించి రూట్, జాయింట్​ రూట్​ఆఫీసర్లుగా ఎంఈవోలు, మండలస్థాయి అధికారులను నియమించారు. ప్రతి సెంటర్​లో ఇన్విజిలేటర్లు, డిపార్ట్​మెంటల్​ అధికారులు, ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్​లను, ఎగ్జామ్స్​నోడల్​ఆఫీసర్లుగా అడిషనల్​కలెక్టర్లను నియమించారు. మంచిర్యాల జిల్లా నోడల్​ఆఫీసర్​గా అడిషనల్​కలెక్టర్​ మోతీలాల్, పోలీస్ నోడల్ అధికారిగా బెల్లంపల్లి ఏఆర్ ఏసీపీ సుందర్, రీజియన్ కోఆర్డినేటర్ గా నరేందర్ రెడ్డి వ్యవహరిస్తారు. 

సీసీ కెమెరాలు, లైవ్​ టెలికాస్ట్ 

ఎగ్జామ్స్​ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లైవ్​ టెలికాస్ట్​ ద్వారా టీజీపీఎస్సీ అధికారులు ఎగ్జామ్స్​ తీరును మానిటరింగ్​ చేస్తారు. బీఎన్ఎస్​163 సెక్షన్​ విధించడంతో సెంటర్లకు 200 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు.

 500 మీటర్ల వరకు జనం గుమిగూడరాదు. సమీపంలోని జిరాక్స్​సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బందిని నియమించారు. తాగునీరు, టాయ్​లెట్స్, కరెంట్​ సప్లయ్​తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ అధికారులు సెంటర్ల వరకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు.