న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన జైడస్ క్యాడిలా కంపెనీ జైకొవ్–డి పేరుతో కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు గురువారం అప్లికేషన్ పెట్టుకుంది. ఇది త్రీ డోస్ టీకా అని, తొలి డీఎన్ఏ వ్యాక్సిన్ అని కంపెనీ తెలిపింది. దీన్ని చర్మం ద్వారా ఇవ్వొచ్చని.. సూది అవసరం లేదని పేర్కొంది. దీనికి అనుమతి లభిస్తే అందుబాటులోకి రానున్న ఐదో టీకాగా, మన దేశంలో అభివృద్ధి చేసిన రెండో టీకాగా నిలవనుంది. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్–వి, మోడెర్నా వ్యాక్సిన్లకు డీజీసీఐ పర్మిషన్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 28 వేల మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, వీరిలో 12 నుంచి 18 ఏండ్లున్నోళ్లు వెయ్యి మంది ఉన్నారని కంపెనీ వెల్లడించింది. జై కొవ్–డి టీకా కరోనా రాకుండా 66.6 శాతం అడ్డుకోగలదని పేర్కొంది. డెల్టా లాంటి కొత్త వేరియంట్లపైనా బాగా పని చేస్తుందని చెప్పింది. ఏటా 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేశామంది. పర్మిషన్ వస్తే 45 నుంచి 60 రోజుల్లో టీకాను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.
