సీఎంకు డీకే అరుణ క్షమాపణ చెప్పాలి : సరిత

గద్వాల, వెలుగు: బీజేపీ నేత డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో వాల్మీకీ బిడ్డను అభ్యర్థిగా నిలబెట్టి మోసం చేశారని జడ్పీ చైర్​పర్సన్  సరిత మండిపడ్డారు. సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. సీఎంకు వెంటనే బేషరతుగా క్షమాపణ  చెప్పాలని డిమాండ్  చేశారు.

అత్త, అల్లుడు ఒకటేనని, అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో అల్లుడికి ఓట్లు వేయించారని ఆరోపించారు. దీన్ని అంగీకరించకుంటే మంగళవారం జములమ్మ అమ్మవారి దగ్గర లేదంటే బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని సవాల్  చేశారు. ప్రమాణం చేయకపోతే అది నిజమని తేలిపోతుందన్నారు. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న వారు, దేశ రాజకీయాల్లో ఉన్నవారు.. అభ్యర్థిని నిలబెడితే 7 వేల ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందని, మహబూబ్ నగర్  పార్లమెంట్  ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి రైతులు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోతే పంటలు వేయొద్దని చెప్పడం జరిగిందన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్  ప్రభుత్వంపై నెట్టడం దుర్మార్గమన్నారు. జూరాల డ్యాంలో నీళ్లు మరో 15 రోజుల వరకు తాగునీటికి సరిపోతాయని, ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మున్సిపల్  చైర్మన్  బీఎస్  కేశవ్, మధుసూదన్ బాబు, నాగేందర్ యాదవ్, లక్ష్మణ్  పాల్గొన్నారు.