జహీరాబాద్ ట్రైడెంట్ లోక్రషింగ్ కష్టమే!...చేతులెత్తేసిన యాజమాన్యం

  • నమ్మించి మోసం చేశారంటున్న చెరుకు రైతులు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: ఆరు దశాబ్దాల చరిత్ర గల జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో ఈసారి చెరుకు క్రషింగ్ కష్టంగా కనిపిస్తోంది. దీంతో కోతకొచ్చిన చెరుకును పొలంలో ఉంచలేక రైతులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ నష్టాల భారినపడుతున్నారు. 2024–-25 సీజన్​లో క్రషింగ్ మొదలుపెడతామని ట్రైడెంట్ యాజమాన్యం విస్తృతంగా ప్రచారం చేసింది. 

ఫ్యాక్టరీ రిపేర్​పనులు చేస్తున్నామంటూ నమ్మించి తీరా క్రషింగ్ టైం వచ్చేసరికి చేతులెత్తేసిందని రైతులు విమర్శిస్తున్నారు. కొంతకాలంగా క్రషింగ్ చేయకపోవడంతో ఈ ఏడాది మొదట్లో జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎలాగైనా ఈసారి క్రషింగ్ మొదలు పెడతామని చెప్పి పంట వేశాక తీరా క్రషింగ్ స్టార్ట్ చేయకపోవడంతో చెరుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

మొదటి నుంచి ఇబ్బందులే..

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల స్థానిక చెరుకు రైతులకు మొదటి నుంచి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. బిల్లుల చెల్లింపులు, క్రషింగ్ చేపట్టకపోవడం, ఫ్యాక్టరీ ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం, ఫ్యాక్టరీ ఆస్తుల వేలానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈసారి మాత్రం డిసెంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ మొదలు పెడతామని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది.

 ఆ తర్వాత కార్మికులు, ఫ్యాక్టరీ సిబ్బంది సమక్షంలో పూజలు చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కానీ క్రషింగ్ చేయలేమని యాజమాన్యం చేతులెత్తేసినట్టు కార్మిక వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

8 లక్షల టన్నుల చెరుకు

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఫ్యాక్టరీ సమీపంలో దాదాపు 7 లక్షల టన్నుల చెరుకు నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం స్పందించి సంగారెడ్డి ఫసల్వాది సమీపంలోని గణపతి షుగర్ ఫ్యాక్టరీకి జహీరాబాద్ చెరుకును తరలించాలని అందుకు ఫ్యాక్టరీ వద్ద అనుకూల పరిస్థితులు కల్పించాలని సూచించింది. జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో 10 వేల ఎకరాల్లో సాగుచేసిన దాదాపు 4 లక్షల టన్నుల చెరుకును కామారెడ్డి జిల్లాలోని మాగీ గాయత్రి షుగర్స్, వనపర్తి జిల్లా కొత్తకోట కృష్ణవేణి షుగర్స్, సంగారెడ్డి సమీపంలోని గణపతి షుగర్స్ కు తరలించాలని చెరుకు అభివృద్ధి మండలి అధికారులు సూచించారు. 

కోహిర్, జరాసంఘం, న్యాల్కల్, రాయికోడ్, వట్ పల్లి, రేగోడు మండలాల్లో సాగుచేసిన 8 వేల ఎకరాల్లో సుమారు 4 లక్షల టన్నుల చెరుకును రాయికోడ్ మండలంలోని గోదావరి గంగా ఆగ్రో ఫ్యాక్టరీకి తరలించే అవకాశం ఉంది. వీటితోపాటు పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్రకు చెరుకును తరలిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాలకు రైతులు నేరుగా పంటను తరలించే అవకాశం లేనందున మధ్య దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తద్వారా గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు. 

పొరుగు రాష్ట్రాల్లో..

జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ సమస్య కారణంగా చెరుకు రైతుల కష్టాలను ఆసరాగా చేసుకుని పొరుగు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీలు మన రైతులను నిండా ముంచుతున్నాయి. గతేడాది మన రాష్ట్రంలో టన్ను చెరుకు ధర రూ.3,260 ఉండగా, పొరుగు రాష్ట్రాల్లో రూ.2,500 మాత్రమే చెల్లిస్తున్నారు. కోత, రవాణా ఖర్చులు భరిస్తామంటూ ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి. స్థానికంగా క్రషింగ్ సమస్య ఉండడంతో తప్పని పరిస్థితుల్లో చెరుకు రైతులు కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ప్రతి ఏడాది పంట వేసి నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ మొదలు పెట్టించాలని కోరుతున్నారు.