- పెద్దపల్లి జిల్లాకు సీఎం వరాల జల్లు
- రూ. 1000 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు
- ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్ల అభివృద్ధికి రూ.677 కోట్లు
- పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు శంకుస్థాపన
పెద్దపల్లి, వెలుగు: విజయోత్సవ వేడుకల్లో భాగంగా యువ వికాసం పేరుతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. సుమారు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సీఎంను ఆహ్వానించారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం.. జిల్లాకు చెందిన వివిధ శాఖలు గరుడ, సింగరేణి, యంగ్ ఇండియా, ఆలీఫ్, ఎన్ఎస్ఐసీ, టామ్‌కామ్, డీఈఈటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైనవారిలో15 మందికి నియామక పత్రాలు అందజేశారు.
సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన జనం
పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభకు భారీగా జనం తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌తోపాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచే జనాలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారుల ఆటపాటలతో సభకు వచ్చిన జనం ఎంజాయ్ చేశారు. మంత్రులు, సీఎం మాట్లాడే వరకు ప్రజలంతా ఓపికగా విన్నారు. దాదాపు లక్షకు పైగా జనం సభకు హాజరయ్యారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ హర్షంవ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పెద్దపల్లి జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు వర్చ్‌వల్‌గా శంకుస్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.600 కోట్లు, పీఆర్ రోడ్ల నిర్మాణానికి రూ. 77 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కరెంట్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ. 26 కోట్లు, నర్సింగ్ కాలేజీకి రూ.10 కోట్లు, రూ. 10 కోట్లతో శాతవాహన కాలేజీ అకాడమిక్ బ్లాక్‌లకు శంకుస్థాపన చేశారు.
రూ. 82 కోట్లతో పెద్దపల్లిలో చేపట్టనున్న బైపాస్, రూ. 51 కోట్లతో జిల్లా హాస్పిటల్ అప్‌గ్రేడ్ , పెద్దపల్లి బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, పెద్దపల్లి మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు, సుల్తానాబాద్రూ. 5 కోట్లు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయానికి రూ. 5 కోట్లు, మహిళ సంఘాల సంక్షేమానికి రూ. 5 కోట్లు మంజూరు చేశారు.
Also Read :- గ్రేటర్ లో హౌసింగ్ భూములకు లీజు కడ్తలే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ది పనులకు నిధులను మంజూరు చేయించానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. యువ వికాసం సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్జతలు చెప్పారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.461 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రజల చిరకాల కోరిక పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు కల నెరవేరనుందన్నారు.
పెద్ద కల్వల నుంచి అప్పన్న పేట వరకు 4 లైన్ల బైపాస్ రూ.82 కోట్లతో నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు భద్రత మెరుగుపరిచే దిశగా పెద్దపల్లి పట్టణంలో మహిళా, ట్రాఫిక్, రూరల్ పోలీస్‌స్టేషన్లతోపాటు ఎలిగేడు మండలంలోనూ పోలీస్ స్టేషన్ మంజూరు చేశామన్నారు.
ఓదెల మండలం రూప్ నారాయణపేట నుంచి జమ్మికుంట వరకు మానేరు నదిపై రూ. 80 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించామన్నారు. రూ. 25 కోట్లతో కాల్వ శ్రీరాంపూర్ నుంచి పోత్కపల్లి వరకు, రూ.7 కోట్లతో పి.డబ్ల్యూ.డి రోడ్డు నుంచి వెన్నంపల్లి వరకు, రూ.6 కోట్లతో గర్రెపల్లి నుంచి ఎలిగేడు, రూ.12 కోట్లతో సుగ్లంపల్లి నుంచి ధూళి కట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
ధర్మపురి అభివృద్దికి రూ.50కోట్లు కేటాయించండి
ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్ సీఎంను సభాముఖంగా కోరారు. గతంలో ధర్మపురి ఆలయ అభివృద్ధికి అప్పటి పాలకులు రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ధర్మపురి సీవరేజీ లైన్ నేరుగా గోదావరిలో కలవడం వల్ల నది కలుషితమవుతోందని, ప్రక్షాళనకు రూ.17 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు
రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ తెలిపారు. ఎల్లంపల్లి ద్వారా యావత్ తెలంగాణకు సాగు, తాగునీరు అందిస్తున్నామన్నారు. అమృత్ పథకం, టీయూఎఫ్ఐడీసీ, సింగరేణి నిధుల ద్వారా రామగుండం అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కృషి చేయాలని సీఎంను కోరారు.