ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం పార్టీలో చేరికల జోష్ నెలకొంది. అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు భారీగా టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి మారడాని రంగారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో డిసెంబర్ 14న జాతీయ టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, రంగారావుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రంగారావు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
మారడాని రంగారావు మాత్రమే కాకుండా.. డిసెంబర్ 14న కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన ఎంతో మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు నియోజకవర్గంలో కూడా ఆటో యూనియన్ లీడర్ నగరబోయిన లీలా కృష్ణతో కొంతమంది టీడీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో యూనియన్ నేతలు చంద్రబాబు ముందు చెప్పుకున్నారు.
ఇదిలా ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి దంపతులు (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు (ఉదయగిరి) చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా టీడీపీలో చేరారు. ఆరు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు సైకిల్ ఎక్కారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నేతలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైసీపీ నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. కాగా, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే టీడీపీకి మద్దతు ప్రకటించారు.