మా ప్రాణాలుపోతే కోటి రూపాయిలు వ‌చ్చేవి: వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

మా ప్రాణాలుపోతే కోటి రూపాయిలు వ‌చ్చేవి: వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

గ‌త వారంలో మే 7న‌ విశాఖప‌ట్నంలోని ఎల్పీ పాలిమ‌ర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి 12 మ‌ర‌ణించి తీవ్ర విషాదం నెల‌కొన్న స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారికి ఏపీ ప్ర‌భుత్వం రూ. కోటి ప్ర‌క‌టించ‌డంతో తాము చ‌నిపోయి ఉంటే త‌మ కుటుంబానికి కూడా కోటి రూపాయాలు వ‌చ్చేవని కొంద‌రు అనుకుంటున్నారంటూ కామెంట్ చేశారు. ఓ న్యూస్ చానెల్ లో మే 9న జ‌రిగిన డిబేట్ లో ఆయ‌న మాట్లాడుతూ తాను ఇలాంటి మాట‌లు అన‌కూడ‌దంటూనే నోరు జారారు. అయ్యో ఈ ప్ర‌మాదంలో మా ప్రాణాలు పోయుంటే బాగుండు.. మావాళ్ల‌కు కోటి రూపాయ‌లు వ‌చ్చుండేవి కాదా అని ఆ ప్రాంతంలో కొంత‌మంది అనుకుంటున్నారు అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సామాన్య ప్ర‌జ‌లు మొద‌లు రాజ‌కీయ నేత‌ల వ‌ర‌కు అంతా ఆ ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయ‌డ‌మేంటంటూ ఫైర్ అవుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క లేకుండా డ‌బ్బుతో ముడిపెట్టి మాట్లాడ‌టం త‌గ‌దని ప్ర‌తిప‌క్ష నేతలు త‌ప్పుబ‌డుతున్నారు.

ప్ర‌జ‌ల‌పై రుద్దొద్దు.. మీరే వెళ్లి గ్యాస్ లీక్ చేసుకోండి

టీడీపీ నేత‌లు న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, రేవ‌తి వంటి వారు ట్విట్ట‌ర్ లో వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌ను పోస్ట్ చేసి.. ఆయ‌న తీరును త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌జ‌ల‌పై వైసీపీ నేత‌లు త‌మ అభిప్రాయాల‌ను రుద్దొద్దంటూ మండిప‌డ్డారు కిశోర్ కుమార్ రెడ్డి. ‘మీరు అలా అనుకుంటే వెళ్లి గ్యాస్ లీక్ చేసుకోండి. ఒక కోటి మీ ఇంటికి ఇస్తారు. అంతేగాని ప్రజలపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు వద్దు’ అని అన్నారు.