బషీర్ బాగ్, వెలుగు: తన తండ్రి హత్య కేసులో ఐదేండ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆమె అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రిని చంపిన వారితో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని తెలిపారు.
ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉందన్నారు. నలుగురు నిందితులను సీబీఐ అధికారులు మొదట చార్జిషీటులో చేర్చారని, ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్ , ఏ3 ఉమాశంకర్ రెడ్డి, ఏ4 దస్తగిరిగా పేర్కొన్నారని తెలిపారు. వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత అన్ని మీడియా చానల్స్‌లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్లో వివరించారు. తన తండ్రి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసన్నారు. హత్యలు చేయించిన వారు చట్టసభల్లో ఉండకూడదనేదే తన తాపత్రయం అని తెలిపారు.