జగన్ కు ఓటేయద్దు - వివేకా భార్య సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఓటేయద్దన్న తన కూతురు సునీత వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని, తన అభిప్రాయం కూడా అదేనని అన్నారు. ఇటీవల వివేకా కూతురు సునీత జగన్ పార్టీకి ఓటేయద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సునీత తల్లి కూడా ఇదే వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌభాగ్యమ్మ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబం అంతా కలిసి వెళ్లి జగన్ ను కలిసి న్యాయం చేయమని కోరామని, ఆ సమయంలో తన కూతురు, అల్లుడిని తప్పుపట్టే విధంగా మాట్లాడారని అన్నారు. తమకు శత్రువులు ఎక్కడో లేరని, కుటుంబంలోనే ఉన్నారని తెలుసుకునేందుకు చాలా సమయం పట్టిందని అన్నారు. అప్పటి నుండి బయటకు వచ్చి ఒంటరిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు సౌభాగ్యమ్మ.

వివేకానందరెడ్డి హత్య తెల్లవారుజామున జరిగితే సాయంత్రం వరకు జగన్‌ పులివెందులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వివేకా మరణవార్త విని తామంతా ఉదయానికే హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయల్దేరి వచ్చామని అన్నారు. జగన్‌ మాత్రం సాయంత్రం దాకా ఎందుకు సమయం తీసుకున్నారని నిలదీశారు. ఈ నేపథ్యంలో సౌభాగ్యమ్మ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాగా, వచ్చే ఎన్నికల్లో సునీత కానీ, సౌభాగ్యమ్మ కానీ టీడీపీ తరఫున కడపలో పోటీ చేస్తారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆమె చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.

ALSO READ :- Venkatesh: వెంకటేష్ కూతురు మెహందీ వేడుకలో..మహేష్ బాబు ఫ్యామిలీ