మా నాన్నను చంపిన వారికి శిక్ష పడేలా చూడండి: వైఎస్ సునీత

తన తండ్రి వైఎస్ వివేకాను చంపిన వారికి శిక్ష పడేలా చూడాలని ఆయన కూతురు వైఎస్ సునీతా రెడ్డి పోలీసులను కోరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి శుక్రవారం (నవంబర్ 15) కడప ఎస్పీ విద్యాసాగర్‎ను కలిశారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ వివేకా హత్య గురించి ఎస్పీతో చర్చించారు. వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన హంతకులకు శిక్ష పడేలా పోలీసులు కూడా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపైన యాక్షన్ తీసుకోవాలని ఆమె పోలీసులను కోరినట్లు సమాచారం. 

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇందులో భాగంగానే విద్యాసాగర్‎కు ముందు కడప ఎస్పీగా వ్యవహరించిన హర్షవర్ధన్ రాజును సైతం ఆమె కలిసి తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని కోరారు. హర్షవర్ధన్ రాజు ట్రాన్స్‎ఫర్ కావడంతో కడప ఎస్పీగా విద్యాసాగర్ వచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ విద్యాసాగర్ తో భేటీ అయిన సునీత.. తన తండ్రి హత్యపై ఆయనతో చర్చించారు.