చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. కావాల్సింది విజన్లు కాదు, విభజన హామీలు.. షర్మిల ట్వీట్

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ( డిసెంబర్ 13, 2024 ) చంద్రబాబు నేతృత్వంలో జరిగిన విజన్ 2047 సభను ఉద్దేశించి ఎక్స్ లో ట్వీట్ చేశారు షర్మిల. విజన్ 2047 పేరుతో చంద్రబాబు  గారు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని.. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదని, విభజన హామీలని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేసి పూర్తిగా అటకెక్కించారని అన్నారు.

ALSO READ : పెన్షనర్లకు కూటమి సర్కార్ భారీ షాక్.. వారందరికీ కట్..

గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని.. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని.. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని.. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది వుంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేదని అన్నారు షర్మిల. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ, దశ పూర్తిగా మారేదని... దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేదంటూ ట్వీట్ చేశారు షర్మిల.

విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ అని అన్నారు. ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోడీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు ప్రజల చెవుల్లో పూలు పెట్టారని అన్నారు. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. చంద్రబాబు  ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమేనని.. హోదాతోనే రాష్ట్రానికి విజన్ అని.. మోడీ పిలక మీ చేతుల్లో ఉందని.. విభజన హామీలపై ప్రధానిని నిలదీయాలని అన్నారు. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండంటూ ట్వీట్ చేశారు షర్మిల.