తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలి.. షర్మిల సంచలన ట్వీట్

ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ ప్రసాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కొసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు కారణం. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాల గురించి ప్రస్తావించే క్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ ఎక్స్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Also Read :- హాట్ టాపిక్గా మారిన కేసులో ట్విస్ట్

తిరుమలను అపవిత్రం చేస్తూ,హిందువుల మనోభావాలను,దెబ్బతీసేలా టీడీపీ,వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని అన్నారు.

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతు నూనె నిజంగా వాడి ఉంటే తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ లేదా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. తన వ్యాఖ్యలపై చంద్రబాబు కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందంటూ ట్వీట్ చేశారు షర్మిల.