తల్లిని కోర్టుకు ఈడుస్తావా..: మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల

వైసీసీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. శనివారం (అక్టోబర్ 26) ఆమె మీడియాతో మాట్లాడుతూూ.. వైవీ సుబ్బారెడ్డి  జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అని విమర్శించిన షర్మిల.. ఆయన నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జగన్ ఇచ్చిన పదవులు అనుభవిస్తు్న్నారు కాబట్టే ఆయన తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు రాజకీయంగానే కాకుండా ఆర్థికంగానూ లాభపడ్డారని ఆరోపించారు. ఒక్క సుబ్బారెడ్డి కాదని.. రేపు విజయసాయి రెడ్డి కూడా ఇలాగే మాట్లాడుతారు.. ఎందుకుంటే వాళ్లంతా జగన్ టీమ్‎లో ఉన్నారని విమర్శించారు.


తాను రాసిన బహిరంగ లేఖలో వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి పేర్లను ప్రస్తావించడానికి కారణం వాళ్ల నిజస్వరూపం బయటపెట్టడానికేనని.. వాళ్ల గురించి మా అమ్మ విజయమ్మకి తెలియజేయడానికేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తులకు సంబంధించి నేను చెప్పినవన్నీ నిజమని నేను ప్రమాణం చేస్తా.. సుబ్బారెడ్డి కూడా ఆయన చెప్పింది నిజమని ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. సాక్షి, భారతి కంపెనీల్లో నలుగురు మనువళ్లకు సమాన వాటాలు ఉండాలనేది రాజశేఖర్ రెడ్డి మ్యాండేట్.. ఇది నిజమని తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు.  తనతో సమానంగా షర్మిలకు ఆస్తులు ఇస్తానని జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మాటకు ఇచ్చారని గుర్తు చేశారు. 

ALSO READ | తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదు: వైవీ సుబ్బారెడ్డి

అసలు గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరైనా ఎంవోయూ రాసుకుంటారా అని ప్రశ్నించారు. ఇది అందరి ఇండ్లలో ఉండేదే.. ఘర్ ఘర్ కీ కహానీ అని జగన్ చాలా సింపుల్‎గా ఆస్తుల విషయాన్ని కొట్టేపారేశారు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చటం ఘర్ ఘర్ కీ కహానీనా అంటూ ఎమోషనల్ అయ్యారు. కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భగ్యుడు ఎవరన్నా ఉన్నారా అని విమర్శించారు. మీకు మానవత్వం, ఎమోషన్స్ లేవా.. మా పిల్లలు మీ కళ్లు ముందు పెరగలేదా.. వాళ్లకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారంటూ సుబ్బారెడ్డి మాటలను గుర్తు చేసుకుని ఆమె కన్నీళ్లుపెట్టుకున్నారు. జగన్ తీరుతో చాలా బాధ వేసిందన్నారు.