వైఎస్సార్ విగ్రహాలపై దాడులు.. షర్మిల ఫైర్

ఏపీలో  దివంగత నేత,  మాజీ  సీఎం వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.  ‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. 

ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు.  వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అని ఆమె డిమాండ్ చేశారు. 

ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు. అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు.