ప్రత్యేక హోదా పైనే తొలి సంతకమంటున్న షర్మిల..!

2024 ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తోంది కాంగ్రెస్ పార్టీ. శుక్రవారం తిరుపతిలో జరిగిన భారీ బహిరంగా సభలో ఏపీ పీసీసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ను విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తారని హామీ ఇచ్చారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన ఈ సభకు షర్మిల, సచిన్ పైలట్, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు.

ఈ సభలో ప్రధాని మోడీ, బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. మోసం చేసే వాడే మోడీ అని, తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన మోడీ ఆ మూడు నామాల వానికే పంగనామాలు పెట్టాడని ఆరోపించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అన్నారు. హోదా ఇవ్వకుండా తల్లి లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ చంపేశారని అన్నారు. పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతోంది కూడా మోడీనే అన్నారు.

విభజన హామీలు అమలు చేయకుండా మోడీ రాష్ట్రానికి  తీవ్ర అన్యాయం చేస్తున్నాడని అన్నారు. హోదా ఇచ్చేవాళ్ళు కావాలా, హోదాను తాకట్టు పెట్టేవాళ్ళు కావాలా అని అన్నారు. కోమాలో ఉన్న కాంగ్రెస్ లో చేరింది కేవలం విభజన హామీల అమలు కోసమే అని స్పష్టం చేశారు. హోదా కోసం ఆరాటపడే వారికి, హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాజన్న సంక్షేమ రాజ్యం తేవటమే తన లక్ష్యమని అన్నారు.