ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల

అమరావతి: ప్రభాస్కు, తనకు సంబంధం ఉందని జరిగిన ప్రచారంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. ఆయన్ని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, తన పిల్లలపై ఒట్టేసి చెబుతున్నానని షర్మిల కుండబద్ధలు కొట్టారు. ప్రభాస్కు, తనకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా అని వైసీపీ అధినేత జగన్ను షర్మిల నిలదీశారు.

మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారని, ఇలా ప్రచారం జరిగిందని తెలిసి కూడా అప్పుడు గాడిదలు కాశారా అని జగన్పై షర్మిల నిప్పులు చెరిగారు. ఎంక్వైరీ ఎందుకు చేయలేదని, జగన్ ఈ దుష్ప్రచారాన్ని ఆయన పార్టీ నేతలతో చేయించారని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ చార్జి షీట్లో పెడతారని, చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. జగన్ మోదీకి దత్త పుత్రుడని షర్మిల విమర్శించారు. తన మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారని షర్మిల చెప్పారు.