“ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే.. కూటమి సర్కార్పై షర్మిల ఫైర్..

విజయవాడ: 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కార్ విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే”  ఇదే మరి అని ఎద్దేవా చేశారు.

ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లని, ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6 వేల కోట్లని ఆమె ఆరోపించారు. ఇంకా రూ.3 వేల కోట్లు ప్రజల పైనే అదనపు భారం పడుతుందని వివరించారు. దీపం కింద వెలుగులు పక్కన పెడితే, కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం కారు చీకట్లు నింపుతుందని షర్మిల మండిపడ్డారు. 

గత వైసీపీ చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. తాము కాదని చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరొకటి కాదని ఆమె చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 9 సార్లు చార్జీలు పెంచితే, కూటమి సర్కార్ కూడా మొదలుపెట్టిందని.. వైసీపీ పాలనకు, కూటమి పాలనకు తేడా ఏముందని షర్మిల నిలదీశారు. 

రూ.6 వేల కోట్ల భారం ప్రజలపై మోపడం భావ్యం కాదని, బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా.. సాయం తీసుకురండని టీడీపీ, జనసేన పార్టీలకు షర్మిల సూచన చేశారు. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు.