ఏపీ ఫలితాలపై ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె జూన్ 5వ తేదీ బుధవారం సోషల్ మీడియా ద్వారా 'రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం' అని గెలిచిన కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.
"రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది" అని ఎక్స్ లో చెప్పుకొచ్చారు.