ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో చాలా చోట్ల హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా కడప ఎంపీ సీటు విషయంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉండగా, టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి బరిలో ఉన్నాడు. అయితే, సీన్లోకి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎంట్రీ ఇవ్వటంతో కడప ఎంపీ సీటుపై రాష్ట్రమంతా చూస్తోంది.
జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న షర్మిల వివేకా హత్యకు కారణం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ ప్రత్యక్షంగా విమర్శలు చేయటం రాజకీయ దుమారం రేపుతోంది. షర్మిలకు తోడు వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా జగన్ కు వ్యతికరంగా ప్రచారం చేస్తుండటంతో కడప రాజకీయం మరింత వేడెక్కింది. షర్మిల, సునీతల విమర్శలను వైసీపీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నప్పటికీ అంతర్గతంగా వైసీపీలో గుబులు మొదలైనట్లే కనిపిస్తోంది.
వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కారణం అవినాష్ రెడ్డి అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కడప ఎంపీ స్థానం విషయంలో పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అవినాష్ ప్లేసులో వైఎస్ అభిషేక్ రెడ్డిని బరిలో దింపాలని జగన్ భావిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో చాలా కాలంగా అభిషేక్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. అభిషేక్ రెడ్డికి జిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉండటం, 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ తరఫున ప్రచారంలో కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఎంపీగా అభిషేక్ ని బరిలో దింపటం వైసీపీకి కలిసొస్తుందని జగన్ భావిస్తున్నాడట.