ఈవీఎంలపై మరోసారి జగన్ సంచలన ట్వీట్..

ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తూ వస్తున్న జగన్ తాజాగా 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా చేసిన ట్వీట్లో బ్యాలట్ పేపర్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈవీఎంల పనితీరును ప్రశ్నించారు జగన్.

మన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్ మనకు స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని.. మనం 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా.. దాని మార్గదర్శక సూత్రాల పట్ల మన నిబద్ధతను చాటుకుందామంటూ ట్వీట్ చేశారు జగన్.

ఈ క్రమంలో ఈవీఎంల పనితీరును ప్రశ్నించిన జగన్..  ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతోందని.. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో లాగానే మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని ప్రశ్న ఉత్పన్నమవుతోందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు జగన్.