చంద్రబాబు.. తల్లిదండ్రులకు ఏనాడైనా రెండు పూటలా భోజనం పెట్టావా: జగన్ సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్.చంద్రబాబు తన తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించారా అని ప్రశ్నించారు.రాజకీయంగా ఎదిగిన తరువాత తల్లిదండ్రులను కలిసి ఏనాడైనా..  రెండు పుటలా ఎప్పుడైనా భోజనం పెట్టి, వారిని సంతోషంగా పంపించావా అంటూ నిలదీశారు జగన్. తల్లిదండ్రులు చనిపోతే..  కనీసం వాళ్లకు తలకొరివి అయినా పెట్టావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు జగన్. 

మానవత విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని.. మానవత విలువలు ఏ మాత్రం లేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు జగన్. చంద్రబాబు రాజకీయాల్లో ఎదగడం కోసం ఏమైనా చేస్తాడని.. ఎలాంటి అబద్ధమైనా ఆడతాడని, ఎలాంటి మోసమైనా చేస్తాడని మండిపడ్డారు జగన్. ఇలాంటి వ్యక్తితో తాము యుద్ధం చేస్తున్నామని, ఈ యుద్ధంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నానని అన్నారు జగన్.

తన కుటుంబంపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై జగన్ ఘాటుగా స్పందించారు. కుటుంబ బాంధవ్యాలు, మానవత విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని.. రాజకీయాల్లో చంద్రబాబు ఎదిగిన తీరును చూస్తే ఇది ఎవరికైనా స్పష్టంగా అర్థమౌతుందని అన్నారు. తల్లి చెల్లి పేరుతో రాజకీయం చేస్తున్నారని, అప్పట్లో షర్మిలపై బాలకృష్ణ ఇంటి నుండి తప్పుడు ప్రచారం చేయించారని అన్నారు. ఐటీడీపీ పేరుతో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు జగన్.