అగ్నిపథ్ స్కీంపై బీహార్లో ఆందోళనలు హింసాత్మకం

అగ్నిపథ్ స్కీంపై బీహార్లో ఆందోళనలు హింసాత్మకం

కేంద్రం తీసుకవచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ బీహార్ లో యువకుల ఆందోళన హింసాత్మకంగా మారాయి. కేవలం నాలుగేళ్లకే సర్వీస్ ను పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బీహార్ ఆర్మీ లవర్స్ పేరుతో నిన్నటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు యువకులు. నవాడ, జహానాబాద్, ముంగర్, ఛాప్రాలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అర్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వగా..వారిని  చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు స్టేషన్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టారు. నాలుగేళ్లు పనిచేసిన తర్వాత తాము ఏం చేయాలని..ఉపాధి కోల్పోయి రోడ్లపై పడతామని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా మంగళవారం అగ్నిపథ్  రిక్రూట్మెంట్ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా తొలి బ్యాచ్ లో  17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయస్కులు దాదాపు 45వేల మందిని నాలుగేళ్ల స్వల్ప కాలపరిమితి  కోసం సైన్యంలో భర్తీ చేసుకోనున్నారు. వచ్చే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని రాజ్ నాథ్ వెల్లడించారు. 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ శిక్షణ పూర్తవుతుందన్నారు.