అభినందన్ మీసకట్టు.. యువతలో క్రేజ్

అభినందన్ మీసకట్టు.. యువతలో క్రేజ్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ దేశం మొత్తానికి రియల్ హీరో అయ్యారు. ప్రాణాలను లెక్క చేయకుండా పాక్ యుద్ధ విమానాల్ని తరిమికొట్టారాయన. శత్రు దేశాన్ని తిప్పటికొట్టే ప్రయత్నంలో తన యుద్ధ విమానం కూలిపోయింది. పాక్ చెరలో చిక్కినా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ముఖం అంతా రక్తం.. చేతులు వెనక్కి లాగి కట్టినా గంభీరంగా నిలబడి.. శత్రు సైన్యం ప్రశ్నలకు సడలని ధైర్యంతో సమాధానం చెప్పారు అభినందన్.

సింహం లాంటి ఆ తెగువకు యావద్దేశం ఫిదా అయింది. రియల్ హీరో.. ధైర్యానికి కేరాఫ్ అంటూ పొగిడింది. సినిమాల్లో నలుగురు విలన్స్ ను కొట్టే రీల్ హిరోల స్టైల్స్ నచ్చి ఫాలో అయ్యే జనం.. తమ రియల్ హీరోను అనుకరించకుండా ఉండగలరా..! అభినందన్ మీసకట్టుకు ఇప్పుడు యువతలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది. కుర్రకారు ఆయనలా తమ స్టైల్ ని మార్చుకుంటున్నారు.

బెంగళూరులో సెలూన్ కు వెళ్లిన యువకుడు మహమ్మద్ చాంద్… ‘నాకు అభినందన్ స్టైల్ క్రాప్ కావాలి’ అని బార్బర్ తో చెప్పాడు. అభినందన్ మీసకట్టుతో బయటకు వచ్చిన ఆయన్ని మీడియా పలకరించగా.. ‘నేను అభినందన్ ఫ్యాన్. నేనే కాదు మా ఫ్రెండ్స అంతా ఆయన్నే ఫాలో అవుతాం. ఆయన స్టైల్ మాకు నచ్చింది. ఆయన మాకు రియల్ హీరో. ఆయనలా కనిపించడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.

ఒక్క బెంగళూరులోనే దేశం మొత్తం ఇప్పుడు అభినందన్ మీసకట్టు కొత్త ట్రెండ్ గా మారింది. ఏ సిటీ, టౌన్, గ్రామంలో చూసినా మాకు అభి స్టైల్ కావాలనే వాళ్లు పెరిగిపోయారు.