లోన్ యాప్ వేధింపులు పీక్ స్టేజ్‌కు చేరాయి. అత్యంత దుర్మార్గంగా వేధిస్తున్నాయి. లోన్ అంతా కట్టినా.. ఇంకా 2 వేల రూపాయలు కట్టాలంటూ వేధింపులకు గురి చేశాయి. అంతేనా.. కొత్తగా పెళ్లయిన భార్య ఫొటోలను సైతం మార్ఫింగ్ చేసి మరీ.. అందరికీ పెట్టారు. కేవలం 2 వేలు అంటే 2 వేల రూపాయల కోసం అత్యంత నీచంగా చిత్రీకరించారు లోన్ యాప్ సిబ్బంది.. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకన్నాడు ఆ కొత్త పెళ్లి కొడుకు.
కేవలం 40 రోజుల క్రితమే పెళ్లయిన ఆ యువకుడు.. లోన్ యాప్ చేసిన అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా- అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర(21) అనే యువకుడికి 40 రోజుల కిందే పెళ్లి జరిగింది. వ్యక్తిగత అవసరాల కోసం నరేంద్ర ఓ ప్రైవేట్ లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. విడతల వారీగా తిరిగి అప్పు చెల్లించాడు. అయితే, మరో కూ.2 వేలు లోన్ అమాంట్ పెండింగ్‌లో ఉంది.
ALSO READ | రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట..- మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు..
దీంతో రెండు వేల కోసం లోన్ యాప్ ఏజెంట్లు నరేంద్రను వేధించారు. త్వరలోనే పెండింగ్ ఉన్న డ్యూ అమౌంట్ ను కట్టేస్తానని చెప్పిన వినకుండా లోన్ యాప్ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక్కడితో ఆగని లోన్ యాప్ ఏజెంట్లు మరో దారుణానికి ఒడిగట్టారు. కొత్తగా పెళ్లి చేసుకున్న నరేంద్ర, అతడి భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించారు. ఈ ఘటనతో బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పరువు పోయిందని నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురి అయ్యాడు.
ఈ క్రమంలోనే 2024, డిసెంబర్ 10వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని నరేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడు నరేంద్ర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాల వల్ల తమ కుమారుడు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఫొటో మార్ఫింగ్ చేసి నరేంద్రను వేధించిన లోప్ యాప్ ఏజెంట్లను గుర్తిస్తామని చెప్పారు. 40 రోజుల కిందే పెళ్లి చేసుకున్న తమ కొడుకు.. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి చావుకి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.