- గతంలో ఎన్నడూ లేనంతగా రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్
- ఆకట్టుకున్న ఐపీఓలు..భారీ లాభాలిచ్చిన షేర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌ను నడిపింది రిటైల్ ఇన్వెస్టర్లనడంలో సందేహం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరిగింది. ముఖ్యంగా యంగ్ ఇన్వెస్టర్లు షేర్లను కొనడం, అమ్మడం తెగ చేశారు. బుల్‌రన్ కొనసాగడంతో తక్కువ టైమ్‌లోనే మంచి లాభాలను చూశారు. ఐపీఓల వైపు పరుగులు తీశారు. ఇలా మొదటి సారి మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్షల మందిలో 29 ఏళ్ల జితేష్ రాజ్ ఒకరు. ఓ డిస్కౌంట్ బ్రోకరేజ్ నుంచి డీమాట్ అకౌంట్ తీసుకొని, రూ. 30 వేలతో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఏడాదిలోపే తన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూను రూ. 2.2 లక్షలకు పెంచుకున్నారు. ‘ వరస్ట్ పరిస్థితుల్లో పెట్టిన రూ. 30 వేలు పోతాయి. ఇదే ఆలోచనతో మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాను. కానీ, అనుకున్నదాని కంటే ఎక్కువ లాభాన్నే పొందాను’ అని రాజ్ పేర్కొన్నారు. ఇప్పుడు తనకొచ్చిన లాభాన్ని లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాడతానని చెబుతున్నారు. ఇందుకోసం పెద్ద బ్రోకరేజి కంపెనీలో అకౌంట్ కూడా తీసుకున్నానని అన్నారు. ఇలా మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది ఇన్వెస్టర్లు తక్కువ టైమ్‌లోనే భారీ లాభాలను చూశారు. వీరిని చూసి మరికొంత మంది ఇన్వెస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది ఓపెన్ అయిన డీమాట్ అకౌంట్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి, మొత్తం 7.72 కోట్ల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఈ నెంబర్ ఈ ఏడాది మార్చి 31 నాటికి 5.5 కోట్లుగా ఉంది.
తొందరగా నేర్చుకుంటున్నారు..
‘ కొత్తగా ఓపెన్ అయిన డీమాట్ అకౌంట్లలో 70 శాతం అకౌంట్లు మిలియనిల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు) కు చెందినవేనని స్టడీస్ చెబుతున్నాయి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి డీమాట్ అకౌంట్లు ఎక్కువగా ఓపెన్ అయ్యాయి’ అని యెస్ సెక్యూరిటీస్ ఎండీ, ప్రశాంత్ ప్రభాకరన్ అన్నారు. ‘ టెక్నాలజీపై
ఈ ఇన్వెస్టర్లకు నాలెడ్జ్ ఎక్కువని, ఫాస్ట్‌గా ఏ విషయాన్నైనా నేర్చుకోగలరని అన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు కేవలం 5–6 శాతం రిటర్న్‌నే ఆఫర్ చేస్తుండడంతో పాటు, స్ట్రాంగ్ బుల్‌రన్ కొనసాగడంతో షేరు మార్కెట్‌లో తమ డబ్బులు పెట్టుకోవడం బెటర్ అని యువత భావిస్తోంది. డీమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ సులువుగా మారడంతో కూడా ఈ సారి మార్కెట్‌లోకి ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు పెరిగారు. గతంలో డీమాట్ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి వారం పట్టేది. ప్రస్తుతం 30 నిమిషాల్లోనే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ పూర్తవుతోంది. డీమాట్ అకౌంట్లు పెరగడానికి బ్రోకరేజి కంపెనీలు రిఫరల్స్‌కు ఇస్తున్న ప్రోత్సాహకాలు కూడా ఒక కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. అప్‌స్టాక్స్ వంటి కంపెనీలు ఒక రిఫరల్‌కు రూ. 1,400 వరకు ఇస్తోంది. మరోవైపు కేవలం షేర్లలోనే కాకుండా ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతున్నారు. కానీ, ఏం తెలుసుకోకుండా ఎంటర్ అవ్వొద్దని నిపుణులు చెబుతున్నారు.
డీమాట్ అకౌంట్లు పెరిగాయిలా!
ఏడాది(నాటికి) డీమాట్ అకౌంట్లు(కోట్లలో)
2016‑17 2.79
2017‑18 3.19
2018‑19 3.59
2019‑20 4.09
2020‑21 5.51
2021‑22 7.71
