చనిపోయిన తాత రమ్మంటున్నాడని..యువకుడు ఆత్మహత్య

  • కొంపల్లిలో ఘటన
  • మాదాపూర్​లో ఆర్థిక ఇబ్బందులతో   మరొకరు..

జీడిమెట్ల, వెలుగు: చనిపోయిన తాత రమ్మంటున్నాడంటూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లికి చెందిన సిరిగాధ రమేశ్​కొడుకు మనోహర్​ (27) ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. మూడు నెలల కిందట మనోహర్​ తాత అనారోగ్యంతో మృతి చెందాడు. 

అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తరచూ నిద్రలో  తాత రమ్మంటున్నాడని కలవరించేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి  భోజనం చేసిన తరువాత బెడ్​రూమ్​లోకి వెళ్లి ఉరేసుకొని మృతి చెందాడు.

 బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. యువకుడి జేబులో సూసైడ్​నోట్​ను గుర్తించారు. అందులో “సారీ మమ్మీ డాడీ..  నాకు తాత గుర్తుకొస్తున్నాడు.. రమ్మంటున్నాడు.. అందుకే వెళ్లిపోతున్నా”అంటూ రాశాడు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మాదాపూర్: ఆర్ధిక ఇబ్బందులతో ఓ యువకుడు హోటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ గుట్టల బేగంపేటకు చెందిన నిమ్మ వంశీకృష్ణరెడ్డి (25) బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ నెల 7న ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. 

ఆ తర్వాత ఇంటికి సమీపంలో ఉన్న అరుణోదయ కాలనీలోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొన్నాడు. బుధవారం ఉదయమైనా అతడు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది వెళ్లి చూడగా, ఉరేసుకొని కనిపించాడు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, యువకుడు ఉద్యోగం లేక అప్పులు చేసి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం.