తమ చెల్లిని ప్రేమపెళ్లి చేసుకున్నాడని ఇద్దరు అన్నలు ఓ యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. పానీపట్‌కు చెందిన 23 ఏళ్ల నీరజ్.. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరిది కులాంతర వివాహం కావడంతో అమ్మాయి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే ఇరుకుటుంబాలను పిలిపించి గ్రామపెద్దలు మాట్లాడడంతో పెళ్లికి అంగీకరించారు. దాంతో గ్రామంలో వీరి పెళ్లి నెల రోజుల క్రితం ఊరందరి సమక్షంలో జరిగింది. అయితే యువతి అన్నలకు మాత్రం ఈ పెళ్లి అసలు ఇష్టంలేదు.
పెళ్లి తర్వాత కూడా యువతి అన్నలు చెల్లికి, నీరజ్‌కు ఫోన్ చేసి బెదిరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నీతో మాట్లాడాలని చెప్పి నీరజ్‌ను యువతి అన్నలు పిలిపించారు. నీరజ్‌తో పాటు అతని అన్న జగదీష్ కూడా వచ్చాడు. మాట్లాడుతున్న క్రమంలో మాటామాటా పెరిగి యువతి అన్నలు ఒక్కసారిగా నీరజ్‌పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో నీరజ్‌ను కనీసం డజనుసార్లు పొడిచారు. దాంతో తీవ్ర రక్తస్రావమైన నీరజ్.. అక్కడికక్కడే చనిపోయాడు. యువతి అన్నలు ఈ దాడి చేయడానికి ముందు యువతికి ఫోన్ చేసి.. నవ్వు కాసేపట్లో ఏడుస్తావ్ అని హెచ్చరించారు. దీనిని బట్టి హత్యకు ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.
‘కొత్త జంట కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. కానీ యువతి అన్నలు మాత్రం ఒప్పుకోలేదు. గ్రామ పంచాయతీ సమావేశంలో పెళ్లి గురించి లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి యువతి అన్నలు దంపతులను బెదిరిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఓ బిజీ మార్కెట్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. మార్కెట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలో హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోతున్నట్లు రికార్డయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం’ అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ తెలిపారు.
హర్యానాలోని రోహ్తక్‌లో రెండు రోజుల క్రితం కూడా ఒక పరువు హత్య జరిగింది. తమకు ఇష్టంలేకుండా పెళ్లి చేసుకుందని యువతిని ఆమె కుటుంబసభ్యులే కాల్చి చంపారు. ఆ ఘటన మరువకముందే హర్యానాలో మరో పరువు హత్య జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
For More News..
కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసిన జాతీయ ఎస్సీ కమిషన్
సీఎంను చంపితే పది లక్షలిస్తామంటూ పోస్టర్
త్వరలో సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్స్.. పార్టీల ఫోకస్
