ఇన్‌స్టా ఫ్రెండ్‌తో సహజీవనం ..25 తులాల బంగారంతో కడప యువకుడి పరార్

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళతో ఓ యువకుడు సహజీవనం చేసి, 25 తులాల బంగారంతో ఉడాయించాడు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్​వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరుకు చెందిన మహిళకు 2020లో ఇన్​స్టాగ్రామ్ ద్వారా ఏపీలోని కడప జిల్లా చక్రాయపేట మండలం మహదేవపల్లికి చెందిన కొప్పర్తి మహేశ్వర్ రెడ్డి పరిచయమయ్యాడు. ఆ సమయంలో సదరు మహిళ కొంపల్లిలో నివాసం ఉండగా, ఆమె భర్త ఈ ఏడాది ఏప్రిల్ 4న చనిపోయాడు. 

ఆ విషయం తెలుసుకున్న మహేశ్వర్​రెడ్డి ఇన్సూరెన్స్, డెత్ సర్టిఫికెట్​చేయిస్తానని ఆమెతో మాయమాటలు చెప్పాడు. అప్పటినుంచి అదే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశాడు. ఆగస్టులో ఆమె బొంగ్లూరులోని ఓ అపార్ట్​మెంట్​లో ప్లాట్ కొనగా,  గృహప్రవేశానికి మహేశ్వర్​రెడ్డి చెల్లి, తల్లిదండ్రులు వచ్చారు. తాను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అక్టోబర్​వరకు అదే ప్లాట్​లో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఏదైనా వ్యాపారం చేద్దామని చెప్పి బాధితురాలి నుంచి 25 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. అప్పటినుంచి ఎన్నిసార్లు ఫోన్​ చేసినా రెస్పాండ్ కాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితురాలు ఆదిబట్ల పీఎస్​లో బుధవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.