ఏపీలో ఇంత దారుణమా : మూడున్నరేళ్ల చిన్నారిని రేప్ చేసి.. చంపి.. పాతిపెట్టేశాడు.. !

ఈ మధ్య  మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు హృదయాన్ని  కలిచివేస్తున్నాయి. చిన్నా చితకా.. బంధాలు, బంధుత్వాలు,  వావి వరసలు  లేకుండా  అత్యాచారం చేసి అతి దారుణంగా చంపుతున్నారు  కామంధులు.  అభశుభం తెలియని చిన్నారుల మానాలు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కనికరం లేకుండా మనిషనే విషయాన్ని మరిచి కనిపిస్తే చాలు కాటేస్తున్నారు   మూర్ఖులు.  జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఘటనలు చూస్తే వీళ్లు మనుషులా..లేక మానవ మృగాలా?  అనిపిస్తుంది. కొన్ని సార్లు ఇలాంటి మూర్ఖుల కంటే  మాటలు రాని ఆ  జంతువులే నయ్యమనిపిస్తుంది. 

 లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లోని  తిరుపతిలో జరిగిన  అతి దారుణమైన ఘటన కలచివేస్తోంది.  మూడన్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా  హత్య చేశాడు ఓ  దుర్మార్గుడు.   బంధువే చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపించి తీసుకెళ్లి హత్యాచారం  చేసి అంతమొందించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో  నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే.?

తిరుపతి జిల్లా  వడమాలపేట మండలం ఏయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీ యానాది కాలనీకి చెందిన మూడున్నరేళ్ల చిన్నారిని అదే కాలనీకి చెందిన  సమీప బంధువు  అయిన సుశాంత్(22) చిన్నారికి  చాక్లెట్లు కొనిపిస్తానని నవంబర్ 1న శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. 

అయితే బాలిక గట్టిగా అరవడంతో చంపి అక్కడే పూడ్చి పెట్టేశాడు నిందితుడు సుశాంత్.  అయితే రాత్రైనా  చిన్నారి కనిపించకపోవడంతో   పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుశాంత్ ను  అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి  చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి  పోస్టుమార్టం  కోసం  పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.