త్వరలో  యోనో 2.0 తీసుకొస్తాం

త్వరలో  యోనో 2.0 తీసుకొస్తాం

న్యూఢిల్లీ: రిటైల్‌, కార్పొరేట్‌ బారోవర్ల నుంచి  డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ క్రెడిట్ గ్రోత్‌ 15 శాతంగా రికార్డవుతుందని స్టేట్‌ బ్యాంక్ అంచనావేసింది.   ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌‌ నాటికి బ్యాంక్ ఇచ్చిన  అప్పులు 14.93 % (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 29 లక్షల కోట్లకు  చేరుకున్నాయి.    కిందటేడాది జూన్  క్వార్టర్‌‌ నాటికి బ్యాంక్ ఇచ్చిన అప్పులు రూ.25.23 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఈ జూన్ క్వార్టర్‌‌లో బ్యాంకు ఇచ్చిన అప్పుల్లో రిటైల్ లోన్ల  వాటా 18.58 % పెరిగిందని, కార్పొరేట్‌లకు ఇచ్చిన అప్పులు 10.57 % పెరిగాయని ఎస్‌బీఐ పేర్కొంది. యోనో 2.0 ను త్వరలో తీసుకొస్తామని బ్యాంక్ చైర్మన్ దినేష్‌ కుమార్ ఖారా అన్నారు. ఈ యాప్‌తో మరిన్ని అడ్వాన్స్డ్‌ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని  చెప్పారు. యోనోలో రిజిస్టర్‌‌ చేసుకున్న యూజర్ల సంఖ్య 5.25 కోట్లను దాటిందని, కొత్తగా ఓపెన్ అవుతున్న సేవింగ్స్‌ అకౌంట్లలో 65%  యోనో ద్వారానే జరిగాయని అన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో   కార్పొరేట్లకు, చిన్న పరిశ్రమలకు ఇచ్చే అప్పులు రూ. 2.5–3 లక్షల కోట్లకు చేరుకుంటాయని దినేష్ కుమార్ పేర్కొన్నారు. 

వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ 

ఎంసీఎల్‌ఆర్‌‌ (లోన్లపై వసూలు చేసే కనీస రేటు) ను ఎస్‌బీఐ  పెంచింది. దీంతో బారోవర్లపై ఈఎంఐల భారం పెరగనుంది. బ్యాంక్‌ ఓవర్‌‌నైట్‌ నుంచి మూడు నెలల కాలపరిమితి కలిగిన లోన్ల ఎంసీఎల్‌ఆర్‌‌ను 7.15 %  నుంచి 7.35 శాతానికి పెంచింది. 6 నెలల కాల పరిమితి కలిగిన లోన్లపై ఎంసీఎల్‌ఆర్‌‌ను 7.25 %  నుంచి 7.65 శాతానికి, ఏడాది లోన్లపై 7.5 % నుంచి 7.7 శాతానికి పెంచింది.  రెండేళ్ల లోన్లపై 7.7% నుంచి 7.9 శాతానికి, మూడేళ్ల లోన్లపై వడ్డీ ఎంసీఎల్‌ఆర్‌‌ను 7.8%  నుంచి 8 శాతానికి పెంచింది.