న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్ డ్రాఫ్ట్ రిజల్యూషన్ స్కీమ్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ స్కీమ్‌పై నోటిఫికేషన్ జారీ చేసిన మూడు రోజుల్లో యెస్ బ్యాంక్‌పై మారిటోరియం ఎత్తివేస్తామని నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడు రోజుల్లోనే బోర్డు ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. 26 శాతం వాటాలకు మూడేళ్ల లాకిన్ పీరియడ్‌లో ఎస్‌బీఐ యెస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేస్తుందని, ఇతర ఇన్వెస్టర్లకు 75 శాతం ఈక్విటీకి లాకిన్ పీరియడ్ ఉంటుందన్నారు. కుప్పకూలుతున్న ఈ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ మారిటోరియంతో నెల రోజుల పాటు ఈ బ్యాంక్ నుంచి రూ.50 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయడానికి వీలు లేదు. ఈ ఆంక్షలు విధించిన తర్వాత ఒక్కరోజులోనే ఆర్‌బీఐ డ్రాఫ్ట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. డ్రాఫ్ట్ స్కీమ్ ప్రకారం.. రీకన్‌స్ట్రక్ట్రెడ్ యెస్ బ్యాంక్‌లో ఉద్యోగులందరూ ఏడాది పాటు పాత రూల్స్ ప్రకారమే పనిచేయొచ్చు. జీతాలు కూడా మారవు. కొత్తగా ఏర్పాటు కాబోయే బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు, ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ను మార్చే అధికారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆఫీసులు, బ్రాంచ్‌లు యథావిధిగా కొనసాగుతాయి. యెస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ 2020 కింద, దీనిలో పెట్టుబడి పెట్టబోయే ఇన్వెస్టర్ కచ్చితంగా 49 శాతం వాటా కొనాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఇన్‌ఫ్యూజన్ నుంచి మూడేళ్ల వరకు ఈ వాటాలను 26 శాతం కంటే తక్కువకు తగ్గించుకోకూడదు.
ఎస్‌బీఐతో పాటు ఏడుగురు..
మరోవైపు యెస్ బ్యాంక్‌లో వాటాలు కొనేందుకు ఎస్‌బీఐతో ఏడుగురు ఇన్వెస్టర్లు చేతులు కలిపినట్టు ఈ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఈ ఇన్వెస్టర్లందరూ కలిసి యెస్ బ్యాంక్‌లో రూ.12 వేల కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహింద్రా బ్యాంక్‌లు, ఇన్వెస్టర్లు రాధాకిషన్ దమానీ, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా, అజిమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్‌లు ఈ డబ్బును సమకూరుస్తాయి. ఆర్‌బీఐకి పంపిన ప్రపోజల్‌లో ఈ ఇన్వెస్టర్లందరూ కలిసి 49 శాతాని కంటే ఎక్కువగా వాటాను కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. వీరిలో ఎస్‌బీఐ అత్యధికంగా 45 శాతం వాటాను పొందనుంది. అలాగే ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్ కుమార్, బ్యాంక్ కొత్త సీఈఓగా నియమించాలని ఎస్‌బీఐ ప్రతిపాదించింది. బల్క్ డిపాజిట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.30 వేల కోట్లను పెట్టనున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్‌లు రూ. వెయ్యి కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దమానీ, ఝన్‌ఝన్‌వాలా, అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్‌లు రూ.500 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాయి. యెస్ బ్యాంక్‌లో వెయ్యి కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్, రూ.600 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు యాక్సిస్ బ్యాంక్‌లు ప్రకటించాయి. అంతేకాక యెస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐ రూ.7,250 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ పెట్టే ఈ ఇన్వెస్ట్‌మెంట్లకు దాని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు నుంచి కూడా అనుమతి లభించింది. ఒక్కో షేరు రూ.10 చొప్పున 725 కోట్ల షేర్లను కొంటామని ఎస్‌బీఐ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో యెస్ బ్యాంక్ షేర్లు 2 శాతం వరకు పెరిగాయి. ఇంట్రాడేలో 9.98 శాతం పెరిగిన షేర్లు.. చివరికి 2 శాతం లాభంతో రూ.25.55 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ స్టాక్ ఇంట్రాడేలో10.57 శాతం లాభపడింది. ఆ తర్వాత 1.80 శాతం లాభంతో రూ.25.50 వద్ద స్థిరపడింది. వాల్యుమ్ పరంగా ఎన్‌ఎస్‌ఈలో 27 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.
రాణా కపూర్‌పై మళ్లీ కేసులు
యెస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్, ఆయన భార్య బిందు, అవంతి రియల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్‌పై సీబీఐ కొత్తగా కేసును నమోదు చేసింది. అమృతా షేర్గిల్ బంగ్లా డీల్‌కు సంబంధించి ఈ కేసును నమోదు చేశామని సీబీఐ వర్గాలు తెలిపాయి.
