యెస్ బ్యాంక్‌పై మారటోరియం వారం చివర్లోనే ఎత్తివేస్తారనే ఆశాభావాన్ని ఎడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ నాయకత్వంలో అందచేసిన రిజొల్యూషన్ ప్లాన్‌ను ఆర్‌బీఐ ఆమోదిస్తే, యెస్ బ్యాంకు మారటోరియం నుంచి బయటపడుతుందని చెప్పారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, క్యాపిటల్ సమీకరణపై వాటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. డిపాజిటర్లలో విశ్వాసం పెంచడంతోపాటు, క్యాపిటల్ సమకూర్చుకోవడమే ఇప్పుడు యెస్ బ్యాంకు ముందున్న లక్ష్యాలని ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓ, ఇప్పుడు యెస్ బ్యాంక్ ఎడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. యెస్ బ్యాంకు డిపాజిట్లు రూ. 2.09 లక్షల కోట్లు. తగినంత క్యాపిటల్ సమీకరించలేకపోతున్న కారణంగా యెస్ బ్యాంక్‌పై గత వారం ఆర్‌బీఐ మారటోరియం విధించింది. బోర్డును రద్దు చేసి ప్రశాంత్ కుమార్‌ను ఎడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. యెస్ బ్యాంకును రిస్ట్రక్చర్ చేసేందుకే ఆర్‌బీఐ ఆజమాయిషీ కిందకి తీసుకొచ్చారు.
సీబీఐ సోదాలు
యెస్ బ్యాంక్ స్కామ్‌లో ఏడు చోట్ల సీబీఐ సోమవారం సోదాలు జరిపింది. ముఖ్యంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ కపూర్ కుటుంబానికి ఇచ్చిన రూ. 600 కోట్ల లంచంపై దృష్టి పెట్టింది. ఈ కేసులో నిందితుల ఇళ్లు, ఆఫీసులను ముంబైలో సీబీఐ అధికారులు సోదా చేస్తున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ షార్ట్‌టర్మ్ డిబెంచర్స్‌లో డబ్బు పెట్టినందుకు ప్రతిగా కపూర్ కూతుళ్లు పెట్టిన డూఇట్ అర్బన్ వెంచర్స్ (ఇండియా)కు వాధ్వాన్‌లు అప్పులిచ్చేలా కుట్రకు రాణా కపూర్ పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది.
ఏప్రిల్–-జూన్ 2018 మధ్యలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ షార్ట్‌టర్మ్ డిబెంచర్స్‌లో యెస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లను పెట్టుబడి పెట్టిందని, డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లకు సంబంధమున్న ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కూ రూ. 750 కోట్ల అప్పును యెస్ బ్యాంక్ ఇచ్చిందని సీబీఐ చెబుతోంది. ఐతే, ఈ డబ్బును ఆర్‌కేడబ్ల్యూ ఏ ప్రాజెక్టుకైతే తీసుకుందో, అందులో పెట్టకుండా డీహెచ్ఎఫ్‌ఎల్‌కు మళ్లించిందని సీబీఐ అధికారులు తెలిపారు. బదులుగా కపూర్ కూతుళ్ల కంపెనీకి వాధ్వాన్‌లు (డీహెచ్ఎఫ్‌ఎల్) రూ. 600 కోట్ల లోన్ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. రూ. 97 వేల కోట్లను బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అందులో రూ. 31 వేల కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
షేరు జిలుగులు
వాటా కొంటామనే ఎస్‌బీఐ ప్రకటనతో సోమవారం సెషన్లో యెస్ బ్యాంక్ షేర్లు 32 శాతం పెరిగాయి. రూ. 2,450 కోట్లతో యెస్ బ్యాంకులో 49 శాతం కొనడానికి ఎస్‌బీఐ అంగీకరించింది. యెస్ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో ఒక దశలో 40.7 శాతం పెరిగి రూ. 22.80 ని తాకింది. చివరకు 31.17 శాతం లాభంతో రూ. 21.25 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 72 కోట్లు, బీఎస్‌ఈలో 6.9 కోట్ల షేర్లు చేతులు మారాయి. బీఎస్‌ఈలో ఈ షేర్ ట్రేడింగ్ వాల్యూమ్ 3.22 రెట్లు ఎక్కువైంది. వాటా కొన్న తర్వాత కూడా యెస్ బ్యాంక్ యధాతథంగానే కొనసాగుతుందని ఎస్‌బీఐ స్పష్టత ఇచ్చింది. ఆ బ్యాంకు ఆస్తులు, అప్పులు విడిగానే ఉంటాయని పేర్కొంది.
ప్రస్తుతం యెస్ బ్యాంక్ షేర్ ముఖ విలువ రూ. 2. మొత్తం 255 కోట్ల షేర్లున్నాయి. ఎస్‌బీఐకి రూ. 10 ముఖ విలువతో 245 కోట్ల కొత్త షేర్లను జారీ చేస్తారు. ఇందుకోసం రూ. 2,450 కోట్లను ఎస్‌బీఐ వెచ్చిస్తుంది. యెస్ బ్యాంక్ రికన్‌స్ట్రక్షన్ కోసం రూ. 10 వేల కోట్ల దాకా పెట్టాలనుకుంటున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ రజ్‌నీష్ కుమార్ చెప్పారు.
