కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతున్న దూరం.. ఏటా 1,800 గంటలు ఫోన్‌తోనే..

కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతున్న దూరం.. ఏటా 1,800 గంటలు ఫోన్‌తోనే..

రజనీ కాంత్‌‌ శివాజీ సినిమాలో ఒక పాట ఇలా సాగుతుంది. ‘‘కూయు సెల్‌‌ఫోన్‌‌ బాసలను ఆపి, కొంచెం కీచురాళ్ల ఇచ్చకాలు విందాం. వట్టి కాళ్లతో గట్టు మీద నడుస్తూ మట్టితో మాటలాడుకుందాం. చిన్న పిల్లలమవుదాం’’ అంటూ కథానాయకుడు గొంతెత్తి పాడుతాడు. అయితే ఈ బిజీలైఫ్‌‌ ఐఫోన్‌‌ 11 జనరేషన్‌‌కు మాత్రం మట్టితో మాట్లాడే సమయం  లేనేదని స్టడీలు చెబుతున్నాయి. చిన్న పిల్లలూ ఫోన్‌‌కు బానిసలు అవుతున్నారని చెబుతున్నాయి. స్మార్ట్‌‌ఫోన్‌‌ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని అంటున్నాయి.  స్మార్ట్‌‌ఫోన్‌‌ కేవలం కాల్స్‌‌ చేసుకోవడానికేకాకుండా షాపింగ్‌‌కు, గేమింగ్‌‌కు, వీడియోలు చూడటానికి, ఫొటోలు తీసుకోవడానికి, టికెట్ల బుకింగ్‌‌కు, చాటింగ్‌‌కు, సోషల్‌‌ మీడియాకు కీలకంగా మారడంతో ఇది లేకుండా పూట గడవని పరిస్థితి నెలకొంది. రోజువారీ మానవ సంబంధాలపై ఈ బుల్లి డివైజ్‌‌ ప్రభావం విపరీతంగా ఉంటున్నదని గ్లోబల్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ బ్రాండ్‌‌ వివో, సైబర్‌‌ మీడియా రీసెర్చ్‌‌ (సీఎంఆర్‌‌) చేసిన సర్వే తెలిపింది.

మనదేశంలోని ఎనిమిది నగరాల్లో జరిగిన ఈ స్టడీ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఇందుకోసం రెండు వేల మంది ఒపీనియన్స్‌‌ తీసుకున్నది. వీరంతా 18–45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు. గృహిణులు, వర్కింగ్‌‌ ప్రొఫెషనల్స్‌‌ కూడా ఇందులో ఉన్నారు.  స్మార్ట్‌‌ఫోన్లు యూజర్ల జీవితాలను, సంబంధాలను ఎంత ప్రభావం చూపిస్తున్నాయనేదానిపై సర్వే ఫోకస్‌‌ చేసింది. ఇందులో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ టీనేజ్‌‌లోనే ఫోన్‌‌ను కొన్నట్టు చెప్పారు. డిగ్రీ పూర్తికాకముందే కొన్నామని 41 శాతం మంది చెప్పారు. హైస్కూల్‌‌ దశ నుంచే ఫోన్‌‌ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంఆర్‌‌ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌‌ గ్రూప్‌‌ హెడ్‌‌ ప్రభురామ్‌‌ మాట్లాడుతూ కాల్స్‌‌ చేసుకోవడంతోపాటు ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ కూడా స్మార్ట్‌‌ఫోన్‌‌ కీలకంగా మారడంతో దీని వాడకం పెరుగుతోందని అన్నారు. వివో ఇండియా బ్రాండ్‌‌ స్ట్రాటజీ డైరెక్టర్‌‌ నిపుణ్‌‌ మార్యా కూడా ఈ వాదనతో ఏకీభవిస్తూ స్మార్ట్‌‌ఫోన్‌‌ నిత్యావసరంగా మారిందని అన్నారు.

సర్వేలోని ముఖ్యాంశాలు:

సగటు ఇండియన్‌‌ తను మెలకువగా ఉన్న టైంలో మూడోవంతు ఫోన్‌‌ వాడుతున్నాడు. అంటే ఏటా 1,800 గంటలను, రోజుకు ఐదు గంటలు ఫోన్‌‌ కోసం కేటాయిస్తున్నాడు.

పదేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు 30 శాతం కంటే తక్కువ మంది మాత్రమే నెలలో ఒకసారైనా తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కలుసుకోగలుగుతున్నారు.

స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా తరచూ ఫోన్‌‌ను చెక్‌‌ చేసుకుంటామని ప్రతి ముగ్గురిలో ఒకరు వెల్లడించారు. కనీసం ఐదు నిమిషాలకు ఒకసారైనా ఫోన్‌‌ చెక్‌‌ చేస్తామని పేర్కొన్నారు.

స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడకం మితిమీరితే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని విషయం తమకు తెలుసని 75 శాతం మంది చెప్పారు.

మొబైల్‌‌ఫోన్‌‌ లేని జీవితం కూడా చాలా (అంటే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపడం) ముఖ్యమని ప్రతి ఐదుగురిలో ముగ్గురు అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్‌‌ డివైజ్‌‌లతో కాకుండా సాటి మనుషులతో గడపడం వల్ల జీవితం మరింత సంతోషంగా ఉంటుందని స్పష్టం చేశారు.