కర్నూలులో యురేనియం వివాదం: ప్రజలతో కలిసి వ్యతిరేకిస్తున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూల్ జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రతిపక్ష వైసీపీ తమ వైఖరి ఏంటో స్పష్టం చేసింది. కర్నూల్‎లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తోన్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ వైఖరిని ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి వెల్లడించారు. యురేనియం తవ్వకాలను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని.. ప్రజల నిర్ణయమే మా పార్టీ నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత జగన్‌ కూడా ప్రజల నిర్ణయం మేరకే వెళ్లాలని సూచించారని ఆమె తెలిపారు. గ్రామానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. యురేనియం తవ్వకాలను కచ్చితంగా అడ్డుకుని తీరుతామని అన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం దిగుతామని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా.. కర్నూల్ జిల్లాలోని కప్పట్రాళ్ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Also Read : మంచి నీళ్ల ముసుగులో సాగునీటి ప్రాజెక్ట్

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే గ్రామస్థులకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే విరూపాక్షిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.