ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి తన రెండో భార్య సాక్షి కూడా సంతకం పెట్టారు. అయితే వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయినట్లు తెలుస్తుంది. అనంతరం కైకలూరు సబ్ రిజిస్ట్రార్ వారికి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జయమంగళ రెండో భార్య సునీత, ఆమె కుమారుడి సమక్షంలో ఈ వివాహం జరగగా.. సునీత వివాహానికి సాక్షి సంతకం పెట్టడం గమనార్హం.
ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. వారికి ఒక కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల కిందట సునీత అనే మహిళను వివాహం చేసుకోగా.. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబ వివాదాలు తలెత్తడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ వివాహ తంతును ఆయన మాజీ భార్య సునీత దగ్గరుండి జరిపించారు. ఆయన కుమారుడు కూడా ఈ పెళ్లి హాజరయ్యారు. గతంలో కైకలూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన జయమంగళ వెంకటరమణ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. రీసెంట్ గానే వైసీపీలో చేరిన ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.