ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే తెలంగాణ లాంటి మరో ఉద్యమం తప్పదు

ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే తెలంగాణ లాంటి మరో ఉద్యమం తప్పదు

అభివృద్ధి అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు కూడా పరిపాలనను విస్తరింపజేయాలని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు అన్నారు.  రాజధాని నిర్మాణంపై  ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక్కచోటే జరగకూడదని, అన్ని ప్రాంతాలకు పాలనను విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పరిపాలన, చట్టసభలు, కోర్టులు.. మూడూ మూడు ప్రాంతాల్లో ఉండాలని అన్నారు.

అభివృద్ది అంతా ఒకే ప్రాంతంలో జరగడం వల్ల రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ధర్మాన హెచ్చరించారు. ఆనాటి సీఎం చంద్రబాబు నిర్ణయంతో  అందరూ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చేశారని, ఏపీలో రాజధాని పేరుతో.. వేలకు వేల ఎకరాలు తీసుకొని రైతుల భూములు లాక్కున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. దళితులను కూడా వదల్లేదని అన్నారు. రాజధాని పేరుతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దోచేసుకున్నారని ధర్మాన అన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఆనాటి నవాబు ప్రయత్నాలు చేశారని, మరి మనం ఏం చేశాం? అని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకే ఏపీ ప్రజలకు మోసం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మనం నేర్చుకోవాల్సిందే ఇదేనని అన్నారు. మరో విప్లవానికో లేదా మరో మోసానికో లేదా మరో ప్రాంత ప్రజలను ధగా చేయడానికో.. బీజం పడేటటువంటి పని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు చేయకూడదని ధర్మాన అన్నారు. అప్పటి మాదిరిగా ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే భవిష్యత్‌లో మరో ఉద్యమం తప్పదని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధర్మాన అన్నారు. ముఖ్యంగా తమ జిల్లా అయిన శ్రీకాకుళానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని ప్లాన్ నడుస్తోందని తాను గతంలోనే చెప్పానని ధర్మాన గుర్తుచేశారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం చూసిన తర్వాతైనా ప్రభుత్వాలు అలాంటి తప్పులు చేయకూడదని, రాజధానిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు ధర్మాన.