ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా... వైసీపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే 'సిద్ధం' (Ysrcp Siddham)పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న వైసీపీ....మేనిఫెస్టో(Ysrcp Manifesto) విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటించనున్నారు. మేదరమెట్ల సిద్ధం సభ ఏర్పాట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy) పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ వివరిస్తారన్నారు. ఈ సభకు గత మూడు సభలు కంటే పెద్ద సంఖ్యలో సుమారు 15 లక్షల మంది హాజరవుతారన్నారు. మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో మార్చి 10 తర్వాత సీఎం జగన్ నియోజకవర్గాల పర్యటన ఉంటుందన్నారు. 25 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుందన్నారు. సిద్ధం సభలతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని విజయసాయి రెడ్డి అన్నారు.
వైసీపీ గత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే(Welfare Schemes) పెద్ద పీట వేసిందని తెలుస్తోంది. చాలా సింపుల్ గా ప్రజలకు సులభంగా చేరేలా ఉండే వైసీపీ మేనిఫెస్టో కూడా గత ఎన్నికల్లో విజయానికి ఒక కారణమని విశ్లేషకులు అంటారు. ఇదే తరహాలో ఈసారి కూడా వైసీపీ మేనిఫెస్టో ఉండనుందని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మార్గాలకు ఈసారి మేనిఫెస్టోలో ప్రాథాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఊతం అందించే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టో రూపొందించామని గతంలో వైసీపీ నేతలు తెలిపారు. ఈసారి కూడా అదే తరహాలో మెరుగైన మేనిఫెస్టో రూపొందించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేసింది.