షర్మిలకు షాక్: ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ...

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై ఈసీకి ఫిర్యాదు చేసింది అధికార వైసీపీ. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ లపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దీంతో జగన్, అవినాష్ లపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ మేరకు కడప మేయర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసు విషయంలో షర్మిల అవినాష్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

హంతకుడిని కాపాడుతున్నారని, చిన్నాన్నను హత్య చేసిన వారికి ఎంపీ టికెట్ ఇచ్చారంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినాష్ ఓడిపోవాలని, జగన్ దిగిపోవాలన్నదే తన లక్ష్యమని, తనను ఎంపీగా పోటీ చేయాలన్నది వివేకా ఆఖరి కోరిక అని, అందుకే ఎంపీగా పోటీ చేస్తున్నానని ఎన్నికల ప్రచారంలో అన్నారు షర్మిల. షర్మిల ఎంట్రీతో కడప రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మరి, తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో ఎప్పటిలాగే వైసీపీ విజయం సాధిస్తుందా లేక అవినాష్ ను ఓడించాలన్న షర్మిల లక్ష్యం నెరవేరుతుందా అన్నది వేచి చూడాలి.