యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు!

యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు!

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలవనున్నారు. విపక్ష పార్టీల సమావేశంలో యశ్వంత్ సిన్హాను నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. గ‌తంలో బీజేపీ హయాంలో మంత్రిగా చేసిన య‌శ్వంత్.. ప్రస్తుతం తృణ‌మూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాల సమావేశానికి ముందే మిగితా పార్టీల డిమాండ్ మేరకు ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు. ఇక ఈ నెల 27న ఉదయం 11.30 నిమిషాలకు ఆయన నామినేషన్ వేయనున్నారు.‘‘ విపక్షాల సీఎంలతో మాట్లాడాను..టీఆర్ఎస్ కూడా యశ్వంత్ సిన్హాకు మద్ధతు ఇస్తానని తెలిపింది. మొత్తం 22 పార్టీలు సిన్హాకు మద్ధతు ఇస్తున్నాయి’’అని శరద్ పవార్ తెలిపారు

యశ్వంత్ రాజకీయ నేపథ్యం..

1984లో ఐఏఎస్ కు రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఆయన..1998,1999,2009లో హజీరాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2002లో కేంద్ర విదేశంగ మంత్రిగా పనిచేశారు. ఇక బీజేపీ నుండి బయటకు వచ్చిన ఆయన గతేడాది తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 

తొలుత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును ప్రస్తావించగా.. అందుకు ఆయన నో చెప్పారు. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేరు వినిపించినా ఆయన కూడా పోటీ చేయనంటూ తప్పుకున్నారు.  అనంతరం బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును టీఎంసీ చీఫ్ మమత ప్రతిపాదించగా, ఆయన కూడా పోటీ చేయబోనని కుండబద్దలుకొట్టారు. మొత్తం ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది. మరో వైపు ఇవాళ అధికార బీజేపీ పార్టీ కూడా త‌మ అభ్యర్థిని తేల్చనుంది. కాగా జూలై 18వ తేదీన రాష్ట్రప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది.