IND vs AUS: జైశ్వాల్‌తో మాములుగా ఉండదు.. స్టార్క్‌ని స్లెడ్జింగ్ చేసిన టీమిండియా ఓపెనర్

పెర్త్ టెస్టులో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి స్లెడ్జింగ్ జరుగుతుంది. నిన్న మార్నస్ లబు షేన్, మహమ్మద్ సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరగగా.. రెండో రోజు ఆటలో భాగంగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ ను స్లెడ్జింగ్ చేశాడు. స్టార్క్ వేసిన ఓవర్లో తొలి మూడు బంతుల్లో ఒక బౌండరీతో సహా జైశ్వాల్ ఏడు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు మిస్ అవ్వడంతో వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లాయి. 

ఈ ఓవర్ లో స్టార్క్ వైపు చూస్తూ నీ బంతి చాలా స్లో గా వస్తుంది అని జైశ్వాల్ అన్నాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్ పై సెటైర్ వేయడం షాక్ కు గురి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో జైశ్వాల్ స్టార్క్ బౌలింగ్ లో ఔటైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. హాఫ్ సెంచరీ చేసి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ లభించలేదు.

జైశ్వాల్ తో పాటు మరో ఓపెనర్ రాహుల్ రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 131 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (50), జైశ్వాల్ (71) ఉన్నారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 10 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ భారత్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.