IND vs BAN 2nd Test: జైశ్వాల్ పరుగుల ప్రవాహం.. గవాస్కర్, పుజారా, సెహ్వాగ్ రికార్డ్స్ బ్రేక్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా 2024 లో జైశ్వాల్ ఆట నెక్స్ట్ లెవల్లో సాగుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ పై జరిగిన సిరీస్ లో 700 కు పైగా పరుగులు చేసిన ఈ యువ ఓపెనర్.. తాజాగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో అదరగొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్ లో 3 అర్ధ సెంచరీలతో 189 పరుగులు చేసి ఈ సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా జైశ్వాల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇప్పుడు చూద్దాం. 

జైశ్వాల్ 2024 లో టెస్ట్ ఫార్మాట్ లో మొత్తం 929 పరుగులు చేశాడు. 22 ఏళ్ళ వయసులో టెస్ట్ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. 1971 లో గవాస్కర్ 918 పరుగులు చేశాడు. కాన్పూర్ టెస్టులో 72, 51 పరుగులు చేసిన తర్వాత ఒక సంవత్సరంలో టెస్టుల్లో అత్యధిక యాభై-ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ ఏడాది జైశ్వాల్ మొత్తం 7 మ్యాచ్‌ల్లో 8 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. చేతన్ చౌహాన్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్, వీరేంద్ర సెహ్వాగ్, ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ ఒక సంవత్సరం టెస్టుల్లో ఏడు సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 

ALSO READ | IND vs BAN 2nd Test: కింగ్ అనిపించుకున్నాడు: రిటైర్మెంట్‌కు ముందు షకీబ్‌కు కోహ్లీ గిఫ్ట్

జులై 2023లో తన టెస్ట్ కెరీర్ ప్రారంభం నుండి జైస్వాల్ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 700 పైగా పరుగులు చేసి టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన రెండవ భారతీయుడుగా నిలిచాడు. 1000 పరుగులను చేరుకోవడానికి జైశ్వాల్ కు కేవలం 16 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం అయ్యాయి. రానున్న నాలుగు నెలల్లో 8 టెస్ట్ మ్యాచ్ లు ఉండడంతో జైశ్వాల్ మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.