- జోరందుకున్న వరి నాట్లు.. ఇప్పటికే 5 లక్షల ఎకరాల్లో పూర్తి
- ఈసారి రికార్డు స్థాయిలో సాగయ్యే చాన్స్
- 5 లక్షల ఎకరాల్లో మక్కలు వేసిన రైతులు
- మరో 5లక్షల ఎకరాల్లో పల్లీ, పప్పు శనగ,ఇతర పంటలు
- యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు
హైదరాబాద్, వెలుగు: యాసంగి సాగు జోరందుకున్నది. ఇప్పటి దాకా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానాకాలం వరి కోతలు పూర్తయిన జిల్లాల్లో యాసంగి నాట్లు కూడా పడ్డాయి. కోతలు ఆలస్యమైన చోట్ల ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు పనులు మొదలుపెట్టారు. ఈయేడు వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో చెరువులు, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా పెరగడంతో బావుల్లోనూ సరిపడా నీళ్లున్నాయి. ఫలితంగా ఈయేడు యాసంగిలోనూ వరి సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి.
ఎక్కువ మంది రైతులు బోరు బావుల కింద వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. యాసంగి వరి సాధారణ సాగు విస్తీర్ణం 47.27 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 70 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వానాకాలంలో రికార్డు స్థాయిలో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలోనూ ఇదే రిపీట్ అవుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. యాదగిరిగుట్ట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే వరి నాట్లు వేస్తున్నారు.
వరి తర్వాతి స్థానంలో మొక్కజొన్న
యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఆ తర్వాత మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 5.89 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5 లక్షల ఎకరాలకు చేరువైంది. యాసంగిలో ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న ఎక్కువగా సాగవుతుంది. మక్కల సాగు కూడా సాధారణ సాగుకంటే మించిపోయే చాన్స్ ఉందని అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక మిగతా అన్ని రకాల పంటలు ఇప్పటివరకు 5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా పప్పుశనగ 2లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది.
అత్యధికంగా వేరుశనగ పంట సాగు
యాసంగి సాగులో ఇప్పటి వరకు పల్లీ పంట (వేరుశనగ) అత్యధికంగా సాగైంది. 2.62 లక్షల సాధారణ సాగు కాగా, ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ప్రధానంగా నాగర్కర్నూల్ ప్రాంతంలో పల్లీ సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క జిల్లాలోనే లక్ష ఎకరాలకు పైగా పల్లీ సాగు జరిగింది. ఈ నేపథ్యంలో యాసంగి సాగులో నాగర్కర్నూల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నిజామాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో 2 లక్షల ఎకరాల చొప్పున, కామారెడ్డి జిల్లాల్లో లక్షకు పైగా ఎకరాల్లో పంటల సాగు జరిగింది.
నామమాత్రంగానే మిల్లెట్ల సాగు
యాసంగి మిల్లెట్స్ సాగులో జొన్న, సజ్జ పంటలే కొంత మేర సాగవుతున్నాయి. యాసంగిలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 1,39,565 ఎకరాలు కాగా, ఇప్పటివరకు సగం మాత్రమే సాగైంది. సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 14,689 ఎకరాలు కాగా, ఇప్పటివరకు పెద్దగా నమోదు కాలేదు. ఇక కొర్రల సాధారణ సాగు 370 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు వంద ఎకరాల్లో సాగైంది. రాగుల సాధారణ సాగు 1,058 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు పెద్దగా సాగు నమోదు కాలేదు.
చాలా జిల్లాల్లో ఆలస్యంగా పనులు
యాసంగి సాగు పనులు పలు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే షురూ అయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో యాసంగి సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది.