- ధర్మ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
- ఆలయానికి రూ.56.23 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సండే కావడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. నారసింహుడి ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.
కొండ కింద లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, పార్కింగ్ ఏరియా, కొండపైన బస్ బే ఏరియా, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. ఆలయంలో నిర్వహించిన నారసింహుడి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.56,23,335 ఆదాయం సమకూరింది.