హడలెత్తిస్తున్న సైబర్​ నేరాలు ..లోన్​ ఇవ్వకుండానే చెల్లించాలని వేధింపులు

  • న్యూడ్​ఫొటోలు షేర్​ చేస్తామంటూ బెదిరింపులు
  • కస్టమర్ కేర్ నకిలీ వెబ్​సైట్లు 
  • లోన్లు ఇస్తామని ఫోన్లు
  • ఆశపడితే ఖాతా ఖాళీ

యాదాద్రి, వెలుగు : జిల్లాలో సైబర్​ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లోన్లు ఇస్తామని వస్తున్న ఫోన్లతో కొందరు ఉచ్చులో చిక్కుకుంటుంటే.. మరికొందరు అత్యవసరాల కోసం యాప్​ల ద్వారా లోన్​ తీసుకోవడానికి ప్రయత్నించి ఇబ్బందుల్లో పడుతున్నారు. తీరా లోన్​ రాకపోగా ఉన్న డబ్బు పోగొట్టుకోవడంతోపాటు పలు రకాలుగా సైబర్​నేరగాళ్ల వేధింపులకు బలవుతున్నారు. 

లోన్ల కోసం సెర్చ్​.. .

సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. లోన్లు ​ఇస్తామని, చాలా మంది మొబైల్​ ఫోన్లకు వాయిస్​ కాల్స్​ వస్తున్నాయి. కొందరు ఇలాంటి కాల్స్​కు  ఆకర్షితులవుతున్నారు. మరికొందరేమో తమ అవసరాల కోసం ఆన్​లైన్​లో అప్పు కోసం యాప్స్​ను వెతుకుతున్నారు. దీంతో వారిని సైబర్​నేరగాళ్లు సులభంగా ఉచ్చులోకి దింపుతున్నారు. వారి మాటలు నమ్మి అడగగానే.. తమ బ్యాంక్​అకౌంట్స్​డిటైల్స్​చెప్పడంతోపాటు మెసేజ్​లు చేస్తున్నారు. పైగా ఓటీపీలు కూడా చెప్పేస్తున్నారు. దీంతో లోన్​వస్తుందని ఆశించిన వ్యక్తి అకౌంట్లోని డబ్బును సైబర్​ నేరగాళ్లు కాజేస్తున్నారు.  

న్యూడ్​ఫొటోలు షేర్​ చేస్తామని..

లోన్ కోసం సెర్చ్​చేసినవారికి ఇవ్వకుండానే.. ఇచ్చినట్టుగా సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తి లోన్​కోసం ట్రై చేసి వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడికి లోన్​ ఇవ్వకపోగా.. అకౌంట్​లోని డబ్బును తస్కరించారు. పైగా తాము రూ.50 వేలు లోన్​ఇచ్చామని పేర్కొంటూ చెల్లించడానికి ఈఎంఐ తేదీలతో ఫోన్​కు వాట్సాప్​మెసేజ్​లు పంపించడంతోపాటు కాల్స్​ కూడా చేశారు. దీంతో బిత్తరబోయిన సదరు వ్యక్తి లోన్ కట్టనని స్పష్టం చేశాడు.

దీంతో నీ న్యూడ్ ఫొటోలు అందరికీ షేర్​ చేస్తామంటూ కొన్ని ఫొటోలు పంపించారు. వేరే వారి శరీరానికి 'తన తల' అతికించి వచ్చిన ఫొటోలను చూడడంతో బెదిరిపోయిన సదరు వ్యక్తి ఫోన్ నంబర్ మార్చుకోవడంతోపాటు స్మార్ట్​ ఫోన్ వాడడమే మానేశాడు. పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు. 

ఫేక్ కస్టమర్ కేర్ వెబ్​సైట్లు..

ఇటీవల సైబర్​నేరగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. గూగుల్, ఇతర సెర్చింజన్‌‌ ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు ఎక్కువ మంది చూసే వెబ్‌‌సైట్లు, సంబంధించిన యాడ్స్ కన్పిస్తున్న విషయం తెలిసిందే. వీటినే సైబర్‌‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని వాటి స్థానంలో ఒక అక్షరం తేడాతో నకిలీ వెబ్‌‌సైట్లు కనిపించేలా చేస్తున్నారు.

దీంతో ఎక్కువ మంది అసలు, నకిలీ వెబ్‌‌సైట్లకు తేడా గుర్తించకుండా అందులోని నకిలీ కస్టమర్‌‌ కేర్‌‌లకే ఫోన్‌‌ చేస్తున్నారు. ఈ కాల్స్‌‌ను అందుకున్న నేరగాళ్లు వివరాలు సేకరించి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి తన ఫ్రెండ్​కు ఫోన్​ పే ద్వారా పంపించిన అమౌంట్​చేరకపోవడంతో ఫేక్ కస్టమర్ కేర్​ను ఆశ్రయించి రూ.40 వేలు పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించాడు. 

పెరిగిపోతున్న కేసులు..

2021–22లో జిల్లాలో ఒక్క సైబర్ కేసు కూడా నమోదు కాలేదు. గతేడాది నుంచి జిల్లాలో సైబర్ నేరాల కేసుల నమోదు మొదలైంది. గతేడాదిలో జిల్లాలో 27 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 80కి పైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే సైబర్​నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బు కోల్పోయినా.. పరువు పోతుందన్న ఉద్దేశంతో కొందరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. మరికొందరేమో తమ పేర్లు బయటకు వెల్లడించవద్దని పోలీసులను కోరుకుంటున్నారు.