- యాదాద్రిలో 106, సూర్యాపేటలో 200 , నల్గొండలో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా యువత ఎక్కువ లిక్కర్ తాగేసి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికేశారు. దొరికిన వారిలో 18 ఏండ్ల వారు ఇద్దరుండగా 20 నుంచి 40 ఏండ్లలోపు వాళ్లే ఎక్కువగా ఉన్నారు. యాదాద్రి జిల్లాలోని మూడు ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా పోలీసులు మరో 22 మందిపై కేసులు నమోదు చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ట్రాఫిక్ జోన్లలో మొత్తంగా 619 కేసులు నమోదు అయ్యాయి. పట్టుబడిన వారిలో లిక్కర్ ఎక్కువ తాగిన వాళ్లే ఉన్నట్టు బ్రీత్ ఎనలైజర్ టెస్టుల్లో బయటపడింది. పట్టుబడిన 106 మందిలో 88 మంది పరిమితికి మించి తాగినట్టు తేలింది.
సూర్యాపేటలో 200 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
సూర్యాపేట : నూతన సంవత్సరం ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేల చర్యలు తీసుకోవడంతో జిల్లాలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన 800 మందిపై, తాగి వాహనాలు నడుపుతున్న 200 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 89 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
నల్గొండలో 246 మంది
నల్గొండ అర్బన్ : నల్గొండ జిల్లాలో ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 31 డిసెంబర్ నాటి అర్ధ రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతూ 246 పట్టుబడ్డారని చెప్పారు.